భారతీయమూ, హిందూమత సంబంధమూ అయిన ప్రతీదాన్నీ వ్యతిరేకించడం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నైజంగా మారిపోయింది. దేశంలోని మెజారిటీ మతస్తుల మనోభావాలను తూలనాడడమే లక్ష్యంగా పెట్టుకునే పెద్దలకు మహా కుంభమేళా కూడా ఒక అవకాశంగా మారింది. ముస్లిముల పండుగలకు టోపీ పెట్టుకుని ఇఫ్తార్ విందులు ఇచ్చే పెద్దలు, క్రైస్తవుల పండుగలకు మెడలో సిలువ వేసుకుని చర్చిలకు వెళ్ళే పెద్దలకు హిందువుల పండుగలు మాత్రం మూఢనమ్మకాలుగా కనిపిస్తాయి. వారు ఆచరించకపోయినా ఎవరికీ అక్కర్లేదు, కానీ పనిగట్టుకుని దూషించడంలో కాంగ్రెస్ పెద్దలది అందెవేసిన చేయి. అయితే ఆ పార్టీలోనూ హిందువులుగా ఉన్న కొంతమంది నేతలు తమ హిందుత్వాన్ని పూర్తిగా వదులుకోలేకపోయారు. పార్టీ లైన్‌ను దాటి మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసారు. ఆ ధిక్కారమును హైకమాండ్ సహించునా? అన్నది వేచి చూడాలి.
ఇఫ్తార్ విందులకు, క్రైస్తవ విందులకు ఆయా మతాలకు సంబంధించిన దుస్తులు ధరించి మరీ హాజరయ్యే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీల్లో ఏ ఒక్కరూ మహాకుంభమేళాకు హాజరు కాలేదు. ఇంక వారి పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న బొమ్మ మల్లికార్జున ఖర్గే అయితే ‘గంగలో మునిగితే పేదరికం పోతుందా?’ అంటూ అపహాస్యం చేసాడు. విచిత్రం ఏంటంటే మహాకుంభమేళా అనేది బీజేపీ అనే రాజకీయ పార్టీకో, ఆర్ఎస్ఎస్ అనే హైందవ సామాజిక సంస్థకో చెందినదిగా వారు భావించినట్లున్నారు. ఆ రెండింటికీ సంబంధం లేని కోట్లాది మంది సామాన్య హిందూ భక్తుల మత విశ్వాసాలను వారు అవహేళన చేసారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మాత్రం తమ హిందూ విశ్వాసాలకు అనుగుణంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. వారిపై ఏ చర్యలు తీసుకుంటారో మరి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 27న ప్రయాగరాజ్‌లో పవిత్రస్నానం ఆచరించారు. దానిపై స్పందిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచిత్రంగా మాట్లాడారు. ‘‘నేను ఎవరి నమ్మకాలనూ ప్రశ్నించాలని భావించడం లేదు. కానీ ఒకమాట చెప్పండి. ఆకలికి చనిపోయే ఒక పిల్లవాడు, బడికి వెళ్ళలేని పేద విద్యార్ధి, పూట గడవడం కష్టంగా ఉన్న కార్మికులు ఇంతమంది ఉండగా ఈ జనాలు వేల రూపాయలు ఖర్చు పెట్టి గంగలో మునగడానికి పోటీలు పడుతున్నారే’’ అని వ్యాఖ్యానించారు. నిజానికి రెండు సంబంధం లేని వేర్వేరు విషయాలను ముడిపెట్టి మాట్లాడి, తమ పార్టీ హిందూ వ్యతిరేకతను నిరూపించుకున్నారు ఖర్గేజీ. కానీ ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు త్రివేణీ సంగమానికి బారులు తీరారు.
ఫిబ్రవరి 3న హిమాచల్ ప్రదేశ్ నుంచి ముగ్గురు ప్రధాన నాయకులు త్రివేణీ సంగమానికి వచ్చారు. ఉపముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి తన కుమార్తె ఆస్థాతో కలిసి పవిత్రస్నానం చేసారు. అదేరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ పవిత్ర స్నానం ఆచరించారు. ఇంకా, ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా పుణ్యస్నానం చేసారు. ‘‘ఇదొక మరువలేని అనుభవం. నా జీవితంలో మొదటిసారి ఇంతమంది ప్రజలు ఒకే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఒకచోట చేరడాన్ని చూస్తున్నాను. హిమాచల్ ప్రదేశ్‌లోని 70లక్షల కుటుంబాల శాంతి, సంక్షేమం, సౌభాగ్యం కోసం ప్రార్థించాను’’ అని చెప్పారు.
ఫిబ్రవరి 10న కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు డి.కె శివకుమార్ కుటుంబ సమేతంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ‘‘144 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం నాకు కలగడంతో ఎంతో సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పారు.
ఫిబ్రవరి 12న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, తన కుమారుడు జయవర్ధన్ సింగ్‌తో కలిసి ప్రయాగరాజ్‌లో పవిత్ర స్నానం చేసారు.
ఫిబ్రవరి 13న మాఘపూర్ణిమ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే తన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీసంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆ స్నానం తనకు ఆధ్యాత్మిక శక్తినిచ్చిందని ఎక్స్‌లో ట్వీట్ చేసారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మహాకుంభమేళాకు హాజరయ్యారు. ‘‘కుంభమేళాకు ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అన్న సంగతిని గంగామాత నిర్ణయిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా అదే రోజు పవిత్ర స్నానం చేసారు.
ఫిబ్రవరి 15న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మహాకుంభమేళాకు వెళ్ళారు, త్రివేణీ సంగమంలో స్నానం చేసారు. నేను ప్రయాగరాజ్‌లో హనుమంతుణ్ణి దర్శనం చేసుకున్నాను. దేశ ప్రజలందరి శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్ధించాను, జై బజరంగ్ బలీ’’ అని ట్వీట్ చేసారు. అదే రోజు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కూడా మహాకుంభ మేళాకు హాజరయ్యారు. తన కుమార్తె వాన్యాతో కలిసి పవిత్ర స్నానం చేసారు. ‘‘నా చిన్నతనం నుంచీ కుంభమేళాకు వస్తూనే ఉన్నాను. ఇదో అద్భుతమైన అనుభవం’’ అన్నారాయన.
ఫిబ్రవరి 16న మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మితేంద్ర సింగ్ యాదవ్ పవిత్ర స్నానం చేసారు. తన రాష్ట్ర ప్రజల సంతోషం కోసం, సౌభాగ్యం కోసం ప్రార్ధనలు చేసారు. అదే రోజు జోధ్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్ ఉచియార్దా పవిత్ర స్నానం చేసారు. పేదరికాన్ని పోగొట్టడానికి కఠోర పరిశ్రమ చేయాలని ఆయనకు తెలుసు. నిజానికి ఆయన వేలాది మంది నిరుపేదలకు తన సొంత సొమ్మునే పంచిపెట్టిన ఉదారుడే ఆయన. మహాకుంభమేళా అనేది ధార్మిక సమ్మేళనం మాత్రమే, దాన్ని అలాగే చూడాలి అని ఆయన వాదన.
ఫిబ్రవరి 19న కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తన మద్దతుదారులతో కలిసి పవిత్రస్నానం చేసారు. తాను ఆ గడ్డకు చెందిన వాడినని, గంగా మాతకు ప్రార్ధన చేసాననీ చెప్పారు.
ఫిబ్రవరి 20న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు, మాజీ ఎంపీ నకుల్ నాథ్ మహాకుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం ఆచరించారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు.
ఫిబ్రవరి 23న మాజీ ఎంఎల్ఎ నీరజ్ దీక్షిత్ పలువురు బీజేపీ నేతలతో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. అదే రోజు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కునాల్ చౌధురి కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసారు. మహాకుంభ మేళా భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి సజీవ ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ కూడా ఆ రోజే పవిత్ర స్నానం ఆచరించారు. మరో కాంగ్రెస్ నాయకుడు సచిన్ యాదవ్ పవిత్ర స్నానంతో పాటు గంగానదిపై నౌకావిహారం కూడా చేసారు. మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష ఉపనేత హేమంత్ కటారే కూడా త్రివేణీసంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు ఉమంగ్ సింఘార్ కుంభస్నానం పూర్తి చేసుకున్నాక ‘స్వచ్ఛమైన హృదయంతో కోరుకునే కోర్కెలను గంగామాత కచ్చితంగా తీరుస్తుంది’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసారు.
చివరిగా ఫిబ్రవరి 25న అంటే మహాకుంభమేళా ముగియడానికి ఒకరోజు ముందు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ కుటుంబ సమేతంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ‘శతాబ్దాలుగా మన ప్రాచీన సాంస్కృతిక వారసత్వంలో కుంభమేళా అవిభాజ్యమైన అంశం. అది మన విశ్వాసం’ అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు.
ఇలా పలువురు అగ్రగణ్యులైన కాంగ్రెస్ నాయకులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి, మహాకుంభమేళా పట్ల తమ ఆదర గౌరవాలను చాటుకున్నారు. తమ ఆధ్యాత్మిక అనుభవాలను పదిమందితోనూ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అంటే పార్టీ హైకమాండ్ తమపై ఎలాంటి చర్య తీసుకున్నా తమ సనాతన ధార్మిక వారసత్వ పరంపరను వదులుకునే ప్రసక్తే లేదని వారు పరోక్షంగా చెబుతున్నారన్న మాట.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు