ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరవాత ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మరోసారి గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. మరోసారి టికెట్ దక్కించుకోవాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలన్నారు. ప్రజలు మరో సారి గెలిపించే విధంగా కార్యక్రమాలను అందించాలని కోరారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
మ్యానిఫెస్టోలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. తల్లికివందనం పథకానికి రూ.9 వేల కోట్లు, ఉచిత గ్యాస్ పథకానికి రూ.2,600 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.8వేల కోట్లు కేటాయింపులు చేశారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన పింఛను పథకానికి రూ.27 వేల కోట్లు కేటాయించారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు