వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వేకోడూరు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జనసేన నాయకుడు జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఓబులవారిపల్లె పోలీసులు రైల్వేకోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. గురువారం రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాదనలు జరిగాయి.
రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేవిధంగా పోసాని వ్యాఖ్యలున్నాయంటూ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అతనిపై 11 కేసులున్నాయని విచారణలో సహకరించడం లేదని, హైదరాబాదులో నివాసం ఉంటున్నారని బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
పోసాని కృష్ణమురళి ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య, పిల్లలు, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోలను న్యాయమూర్తికి చూపించారు. ఓ వైపు సమాజంలో వర్గ విబేధాలు సృష్టించడంతోపాటు, అప్పటి ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
పోసానికి గతంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందించినా లెక్కలేయలేదని, కనీసం హాజరు కాలేదని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు పారిపోయే ప్రమాద ముందని రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.
పోసాని అరెస్టుపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. తమ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలేదే లేదని పోలీసులను జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు