ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా ముగిసింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశుధ్య కార్మికులను, హెల్త్ వర్కర్లను ఇవాళ సన్మానించారు. వారితో కలసి భోజనం చేసారు.
144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈ యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగింది. ఆ సందర్భంగా 66 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విశేషమైన ఏర్పాట్లు చేసింది. అలా మహాకుంభమేళా ఏ సమస్యలూ లేకుండా పూర్తవడంలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్లు విశేషంగా సేవలందించారు. అందుకే వారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సన్మానించారు. స్వచ్ఛ కుంభ్ కోశ్, ఆయుష్మాన్ యోజన పేరుతో సర్టిఫికెట్లు అందజేసారు. తర్వాత వారితో కలసి మధ్యాహ్న భోజనం చేసారు. ఆ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు బ్రజేష్ పాఠక్, కేశవ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి ప్రయాగరాజ్‌లోని అరయిల్ ఘాట్ వద్ద స్వచ్ఛతా అభియాన్‌లో తన మంత్రివర్గ సహచరులు అందరితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘మహాకుంభమేళా 2025ను చక్కగా ఎలాంటి అవాంతరాలూ లేకుండా నిర్వహించడంలో సహకరించిన ప్రయాగరాజ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని మీరు మీ సొంతపనిలా నిర్వహించారు. ఈ నగరం జనాభా సుమారు 25లక్షలు. అలాంటిది ఒకేసారి 5-8కోట్ల మంది వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఊహించుకోవచ్చు’’ అన్నారు.
మహాకుంభమేళా భారీతనం గురించి యోగి వివరించారు. ‘‘ఇంత భారీ జన సమ్మేళనం ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. 66కోట్ల 30లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఒక్క కిడ్నాప్, దోపిడీ, లేదా మరే నేరమూ జరగలేదు. ఏ చిన్న తప్పు జరిగినా పట్టుకుందామని ప్రతిపక్షాలు దుర్భిణీ పెట్టుకుని కూర్చున్నా లాభం లేకపోయింది. వారు తప్పుడు సమాచారం వ్యాపింపజేయడానికి పడరాని పాట్లు పడ్డారు. ఇంత భారీ స్థాయిలో చారిత్రక సంఘటన జరగడం వారిని ఇబ్బందికి గురిచేసింది. మౌని అమావాస్య ఒక్కరోజే 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసారు. ప్రతిపక్షం ఆరోజంతా అబద్ధాలు వ్యాప్తిలో పెట్టడానికి ప్రయత్నించింది. అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించింది. ఎక్కడెక్కడి వీడియోలో తీసుకువచ్చి ఇక్కడ జరిగినట్లు చూపించి ప్రయాగరాజ్‌కు చెడ్డపేరు తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు’’ అని యోగి మండిపడ్డారు.
ఒక రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. ‘‘ఆరోజు రాత్రి విషాదకరమైన సంఘటన జరిగింది. బాధితుల కుటుంబాలకు మా సానుభూతి. అయితే ఆ సమయంలో ప్రతిపక్షాలు కాఠ్మాండూకు చెందిన వీడియోలను వ్యాపింపజేసి తప్పుడు ప్రచారం చేసారు. అయితే భక్తులు మరింత పెద్దసంఖ్యలో రావడం ద్వారా వారికి తగిన పాఠం నేర్పించారు. సనాతన ధర్మ ధ్వజం ఎప్పటికీ తగ్గదని వారు నిరూపించారు’’ అన్నారు.
మహాకుంభమేళా ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రులు పాఠక్, మౌర్య, ఇతర మంత్రివర్గం అందరూ కలిసి అరయిల్ ఘాట్ సంగమ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.