స్వతంత్ర సంగ్రామంలో సాయుధ మార్గాన్ని ఎంచుకున్న వీరుల్లో ముందువరుసన చెప్పుకునే పేరు చంద్రశేఖర్ ఆజాద్. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫకుల్లా ఖాన్ వంటి ఉద్యమకారుల సహచరుడు.
చంద్రశేఖర్ ఆజాద్ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పండిత్ సీతారాం తివారీ, అగరాణీదేవి. కొడుకును కాశీలో చదివించి పెద్ద పండితుణ్ణి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ చదువు మీద పెద్దగా ఆసక్తి లేని చంద్రశేఖర్, తల్లిదండ్రుల ఒత్తిడిని ఎదుర్కోలేక పదమూడవ యేట ముంబైకి వెళ్ళిపోయాడు. అక్కడ ఓ మురికివాడలో రెండేళ్ళు అనేక కష్టాలు పడ్డాడు. చివరికి అంతకంటె చదువే నయమనుకుని 1921 లో వారణాసికి వెళ్ళి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరాడు.
ఆ సమయంలో గాంధీ సహాయ నిరాకరణోద్యమం దేశాన్ని అట్టుడికిస్తోంది. అప్పుడే చంద్రశేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. 15ఏళ్ళ పిన్నవయసులో తన పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. అక్కడ న్యాయమూర్తి ప్రశ్నలకు చంద్రశేఖర్ ఆత్మాభిమానంతో జవాబులు చెప్పాడు. తన పేరు ఆజాద్ అని, తండ్రి పేరు స్వాధీన్ అని, తన ఇల్లు జైలే అనీ సమాధానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. ఆ విధంగా ఆ యువకుడు చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.
ఆజాద్ తన మిత్రులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, రోషన్ సింగ్‌లతో కలిసి ప్రభుత్వ ధనాన్ని దోచుకోడానికి ప్రణాళిక రచించాడు. 1925 ఆగస్టు 9న వారంతా కలిసి కకోరీ అనే ఊరు వద్ద ప్రభుత్వ ధనమున్న రైలును దోపిడీ చేశారు. కొన్నాళ్ళకు ఆజాద్ తప్ప మిగతా వారందరూ దొరికిపోయారు. అప్పుడు ఆజాద్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లో ఓ అటవీ ప్రాంతంలో సాధువులా జీవించాడు.
చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్ తదితరులతో కలిసి హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వారు మొదటగా, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. అయితే స్కాట్ బదులు పొరపాటున సాండర్స్ అనే వాణ్ణి కాల్చారు. ఆ సమయంలో తమను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక భారతీయుడైన పోలీసును ఆజాద్ కాల్చవలసి వచ్చింది. తర్వాత ఆజాద్ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళకు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ కేంద్ర శాసనసభపై దాడి చేసారు. ఆ క్రమంలో వారు పోలీసులకు పట్టుపడ్డారు. ఆ కేసుతో పాటు సాండర్స్ హత్య కేసును కూడా విచారించిన పోలీసులు వారికి ఉరిశిక్ష విధించారు. దాంతో ఆజాద్ కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవవీరులైన భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురులను విడిపించేందుకు సహకరించాలని కోరాడు. కాని నెహ్రూ ఏ జవాబూ చెప్పలేదు.
తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్ వెళ్ళిపోయాడు. అదేరోజు ఆల్ఫ్రెడ్ పార్కులో తమ ఇతర విప్లవ మిత్రులతో చర్చలు జరుపుతున్నాడు. వారిలో రహస్య పోలీసులున్నారు. ఆ విషయం గ్రహించిన ఆజాద్, ముగ్గురు పోలీసులను హతమార్చాడు. అంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తన తుపాకీతో అంతమందిని ఎదుర్కోలేనని గ్రహించిన చంద్రశేఖర్ ఆజాద్, ఆఖరి తూటాతో తనను తాను కాల్చుకుని ప్రాణత్యాగం చేసాడు. 25 ఏళ్ళ పిన్నవయసులో చంద్రశేఖర్ ఆజాద్ దేశం కోసం అమరుడయ్యాడు.