స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన మారణహోమం 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున గుజరాత్‌లోని గోద్రాలో జరిగింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న రామభక్తులైన కరసేవకులను తీసుకెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను ఒక ఇస్లామిక్ గుంపు తగలబెట్టింది. 59 మంది పురుషులు, మహిళలు, పిల్లలను సజీవ దహనం చేసింది. ఆ సంఘటనను పెద్దగా పట్టించుకోని మీడియా, తర్వాత జరిగిన సంఘటనలను ‘ముస్లిముల ఊచకోత’గా అభివర్ణిస్తూ ప్రపంచమంతా చాటింపు వేసింది, హిందువులపై జరిగిన అమానుష వ్యూహాత్మక దాడిని మాత్రం తక్కువ చేసి చూపింది.
2002 ఫిబ్రవరి 25న శ్రీరామజన్మభూమి అయోధ్యలో పూర్ణాహుతి మహాయజ్ఞం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్‌కు చెందిన భక్తులు అయోధ్య నుండి గుజరాత్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో వందలాది మంది యాత్రికులు ఎక్కారు. రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 27 ఉదయం 7.43 గంటలకు ఆ రైలు గోద్రా స్టేషన్‌కు చేరుకుంది. అది బయలుదేరుతుండగా, ఎవరో ఎమర్జెన్సీ చైన్స్ లాగారు. ముస్లింలు ఎక్కువగా నివసించే, తీవ్రవాద శక్తులకు ప్రసిద్ధి చెందిన మురికివాడ ప్రాంతమైన సిగ్నల్ ఫాలియా సమీపంలో రైలు ఆగేలా చేసారు.
రైలులోని చాలా బోగీల్లో ఎమర్జెన్సీ చైన్లు లాగారని, తర్వాత జరిగిన విచారణలో రైలు డ్రైవర్ ధ్రువీకరించాడు. దాంతో మతహింసకు పేరుగాంచిన ప్రదేశంలో రైలు నిలిచిపోయింది. కొద్ది క్షణాల్లోనే రాళ్ళు, పెట్రోల్, మండే స్వభావం కలిగిన ఇతర పదార్ధాలతో దాదాపు 2వేల మంది గుంపు దాడికి పాల్పడింది. అయోధ్య నుంచి వస్తున్న రామభక్తులు ఉన్న ఎస్-6 బోగీని గుర్తించారు. ప్రయాణికులు తప్పించుకోకుండా రాళ్ళు విసిరారు, పెట్రోల్‌లో తడిపిన గుడ్డలతో ఆ బోగీకి నిప్పంటించారు. మంటలు వేగంగా కోచ్‌ను చుట్టుముట్టాయి. 27 మంది మహిళలు, 10 మంది పిల్లలు సహా 59 మంది హిందూ యాత్రికులు ఆ దాడిలో సజీవ దహనం అయిపోయారు.
అప్పటి గుజరాత్ పోలీస్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ జె మహాపాత్ర వివరణ ప్రకారం… దాడికి పాల్పడిన ముందుగానే పెట్రోల్ బాంబులను సిద్ధం చేసుకున్నారు. అది ఆకస్మికంగా జరిగిన ఘర్షణ కాదు. ముందస్తు ప్రణాళికతో పాల్పడిన ఉగ్రవాద దాడి అని అర్ధమయింది. బోగీ లోపల ఒక ముస్లిం వ్యక్తి శవం లభించింది. అతను దాడి చేస్తూ మంటల్లో చిక్కుకుపోయి ఉంటాడని పోలీసులు అంచనా వేసారు.
గోద్రా రైలులో రామభక్తుల మీద ముస్లిముల దాడి స్పష్టంగా తెలిసినప్పటికీ ఆనాటి ప్రధాన స్రవంతి జాతీయ, అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు శరవేగంగా కథనాలను వక్రీకరించాయి. హిందువులను పీడకులుగానూ, ముస్లింలను బాధితులుగానూ చిత్రించాయి. గోద్రా రైలును తగులబెట్టిన నేరస్తులను బైటపెట్టకుండా, ఆ సంఘటన తీవ్రతను తక్కువ చేసి చూపించాయి. ప్రపంచ మీడియా ఉద్దేశపూర్వకంగా గోద్రా రైలు ఘటనను విస్మరించింది. దాని కారణంగా తరువాత జరిగిన అల్లర్లను మాత్రం ముస్లిముల ఊచకోతగా చిత్రీకరించడానికి అత్యుత్సాహం చూపింది. ఆ విధంగా ఆనాటి మీడియా గోద్రా రైలులో సజీవ దహనమైన 59 మంది హిందువుల జ్ఞాపకాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది.
వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ చరిత్రకారులు, సోకాల్డ్ మానవ హక్కుల సంస్థలు గోద్రా రైలు దహనం ఘటనను కప్పిపుచ్చడానికి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై శరపరంపరగా ఆరోపణలు చేసారు.
మీడియా కథనాలకు విరుద్ధంగా అసలు నిజం చట్టపరమైన దర్యాప్తులో నిజం బయటపడింది. గోద్రా రైలు దహనం రాడికల్ ఇస్లామిక్ శక్తులు ముందస్తు ప్రణాళికతో చేసిన హింసాత్మక చర్య అని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. సిట్ విచారణ ద్వారా వెల్లడైన నిజాలను గుజరాత్ హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. ఫలితంగా ఆ దాడికి పాల్పడిన నేరస్తుల్లో చాలామంది దోషులుగా నిర్ధారించబడ్డారు. గోద్రా దాడి ఆకస్మికంగా జరిగిందని, హిందూ సమాజంలో భయాన్ని కలిగించడానికి రూపొందించిన ఒక కుట్రపూరిత ఉగ్రవాద చర్య అని న్యాయవ్యవస్థ నిస్సందేహంగా నిర్ధారించింది.
అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా తప్పుడు ప్రచారాలు ఆగలేదు. గోద్రా రైలు దహనం తర్వాత జరిగిన అల్లర్లను అందరూ ఖండించారు, కానీ అసలు మూలకారణమైన రైలు దహనం ఘటనను జాగ్రత్తగా దాచిపెట్టారు. గోద్రా అనంతర అల్లర్లలో మరణించిన 790 మంది ముస్లింలు, 254 మంది హిందువుల గురించి ఇప్పటివరకూ చర్చిస్తూనే ఉన్నారు. కానీ గోద్రా రైలు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన హిందువుల పేర్లు అయినా తెలియకుండానే వాళ్ళను విస్మరించారు.
వామపక్ష భావజాలం కలిగిన స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తల ఆగ్రహం ఏకపక్షం అన్న సంగతి విస్పష్టంగా తెలుస్తోంది. బిల్కిస్ బానో, బెస్ట్ బేకరీ సంఘటన లాంటి కేసులను నిరంతరాయంగా వార్తల్లో ఉంచుతూ వచ్చారు. కానీ గోద్రాలో తగలబెట్టిన రైలుబోగీలో 10 మంది పిల్లలు, 27 మంది మహిళల దారుణ హత్యలను మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు లేదా ఆకర్షించలేదు. రామభక్తులైన కరసేవకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకున్నారన్న విషయాన్ని ఒప్పుకోడానికి సైతం వారు నిరాకరించారు. తద్వారా సోకాల్డ్ లౌకికవాదుల కపటత్వం బైటపడింది.