దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా కొత్త పింఛను పథకం అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని పథకాలు విలీనం చేయడం ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకూమేలు చేకూరుతుందని భావిస్తోంది. కార్మిక-ఉపాధి కల్పన శాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
నిర్మాణరంగ కార్మికులు, నివాసాల్లో పనిచేసే వారు , గిగ్ వర్కర్లకు అనుకున్న మేరకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి జరగడం లేదు. దీంతో కొత్తగా తీసుకురాబోయే సార్వత్రిక పథకం వీరందరికి మేలు చేసేలా ఉండనుంది.
ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన, కిసాన్ మాన్‌ధన్ యోజన వంటివి ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలువరకు అందుతున్నాయి. ఈ పథకాల అమలు కోసం లబ్ధిదారులు నెలవారీగా రూ.55-రూ.200 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తాలను జమచేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న వ్యవస్థను మనదేశంలోనూ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కసరత్తు చేస్తోంది. జాతీయ పింఛను పథకం యథాతథంగా కొనసాగనుంది.