ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలోని పవిత్ర శైవ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం తిరిగి మే 2న ప్రారంభం కానుంది. శీతాకాలం వాతావరణ కారణాలతో ప్రతీ ఏడాది ఆరు నెలల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు.
గతేడాది నవంబరు 3న ఆలయ తలుపులు మూసివేశారు. భక్తుల దర్శనం కోసం ఈ ఏడాది మే 2 ఉదయం 7 గంటల నుంచి ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సీఈవో విజయ్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు.
మహాశివరాత్రి పర్వదినం వేళ ఓంకారేశ్వర్ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం గురువులు, వేద పండితులు సమాలోచనలు జరిపి కేదార్‌నాథ్ ధామ్ పునఃప్రారంభ తేదీ, సమయాన్ని నిర్ణయించారు. మే 4న బద్రీనాథ్, ఏప్రిల్ 30 న అక్షయ తృతీయ రోజు యమునోత్రి, గంగోత్రి ధామ్‌లు ప్రారంభం అవుతాయని వివరించారు. వీటినే చోటా చారధామ్ యాత్రగా పిలుస్తారు.
ఆలయ పునఃప్రారంభ తేదీ నిర్ణయ సమావేశంలో కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి రావల్ భీంశంకర్, కేదారానాథ్ ఎమ్మెల్యే ఆశ నౌతియాల్, ఆలయ అధికారులు,సిబ్బంది వందలాది భక్తులు పాల్గొన్నారు.