లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటారని అమిత్ షా వెల్లడించారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంపై గతంలో ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రకటనను అమిత్ షా గుర్తు చేశారు.
డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ అన్నారు. దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు.
తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందంటూ స్టాలిన్ చేసిన ఆరోపణలను కూడా మంత్రి తీవ్రంగా ఖండించారు.
అమిత్ షా బుధవారం కోయంబత్తూరులో పర్యటించి బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం Isha Foundation ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు.