ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్ఎచ్ఆర్‌సి) 58వ సెషన్ 7వ సమావేశంలో భారతదేశం పాకిస్తాన్‌ను ఉతికి ఆరేసింది. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, మనుగడ సాగించడానికి అంతర్జాతీయ సహాయం మీద ఆధారపడుతున్న దేశమనీ వర్ణించింది. అలాంటి దేశానికి మాకు లెక్చర్లు ఇచ్చే స్థాయి లేదంటూ మండిపడింది.
జెనీవాలో జరిగిన సమావేశంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం చెప్పమన్న అబద్ధాలను ఆ దేశపు నాయకత్వం చిలకపలుకుల్లా పలుకుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో మానవ హక్క్ల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ న్యాయశాఖ మంత్రి అజామ్ నజీర్ తరార్ చేసిన ఆరోపణలను ఆయన తప్పుపట్టారు.
‘‘పాకిస్తాన్ ఓ విఫల రాజ్యం, అస్థిరతలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ దేశాల సహాయం మీద మనుగడ సాగిస్తోంది. అలాంటి దేశం ఆడుతున్న అబద్ధాలతో కౌన్సిల్ సమయం వృధా అవుతూండడం దురదృష్టకరం. పాకిస్తాన్ మాటలు నిలువెత్తు వంచన, వారి చర్యలు అమానవీయం, వారి పరిపాలన అంతా అసమర్ధతే. భారతదేశం తమ ప్రజాస్వామ్యం, ప్రగతి మీద దృష్టి సారించి ఉంది. తమ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ఆ విలువలను పాకిస్తాన్ నేర్చుకోవాలి’’ అంటూ త్యాగి పాకిస్తాన్‌కు చురకలు అంటించారు.
తన సొంత దేశంలో సమస్యలను పరిష్కరించుకోవడం చేతకాని పాకిస్తాన్, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందంటూ క్షితిజ్ త్యాగి ఆరోపించారు. జమ్మూకశ్మీర్ లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేననీ, అవి ఎప్పటికీ భారతదేశంలోనే ఉంటాయనీ పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో నిలకడగా అభివృద్ధి, సుస్థిరత సాధిస్తున్నామనీ ఆయన వివరించారు.
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశం అంతర్భాగమే, వాటిని భారత్ నుంచి ఎవరూ విడదీయలేదు. జమ్మూకశ్మీర్‌లో గత కొన్నేళ్ళలో సాధించిన అనూహ్యమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రగతే ఆ విషయాన్ని స్వయంగా తనే తెలియజేస్తుంది. దశాబ్దాల తరబడి పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పడరాని పాట్లు పడిన ప్రాంతంలో సాధారణ పరిస్థితి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ప్రజల విశ్వాసానికి నిదర్శనం. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీల ఊచకోత, ప్రజాస్వామ్య విలువల క్రమక్షీణత, ఐరాస ఆంక్షలు విధించిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం… వంటివి రాజ్యవిధానాలుగా ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఎంతమాత్రం లేదు’’ అని త్యాగి అన్నారు.
‘‘భారతదేశం పట్ల తీవ్ర ఉన్మాదంతో కొట్టుకుపోవడాన్ని పక్కకు పెట్టి, పాకిస్తాన్ ప్రభుత్వం తన సొంత ప్రజలకు న్యాయం చేయాలి. అస్థిరత్వంలో కొట్టుమిట్టాడుతూ అంతర్జాతీయ సహకారం మీద ఆధారపడి బతికే విఫల రాజ్యం మాటల కోసం కౌన్సిల్ తన విలువైన సమయాన్ని వృధా చేస్తూండడం దురదృష్టకరం’’ అన్నారు.