సినీ నటుడు, మాజీ రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కొద్దిరోజుల క్రితం నమోదైన ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ 26వ తేదీ రాత్రి సుమారు 8 గంటలు దాటాక అరెస్ట్ చేసారు. ఆ క్రమంలో హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పోలీసులు వారికి సహకరించారు.
చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అభ్యంతరకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లె పీఎస్లో ఫిర్యాదు దాఖలైంది. గతంలో వైఎస్ఆర్సిపిలో ఉన్న పోసాని జగన్ హయాంలో నాటి ప్రతిపక్షంలోని పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. జనసేన పార్టీకి చెందిన మణి అనే నాయకురాలు తమ అధినేత పవన్ కళ్యాణ్ మీద పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసారు. సమాజంలోని వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడడం అనే ఆరోపణలకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేసారు.
వైస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి టీడీపీ, జనసేన పార్టీల నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేసారు. ఆ సందర్భాల్లో ఆయన ఉపయోగించిన భాష అభ్యంతరకరంగానూ, అనుచితంగానూ ఉండేదని ప్రతిపక్షాలు మండిపడేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోసాని మీద ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు, ఛోటా నాయకులు పోసానిపై కేసులు పెట్టారు.
శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇకపై తన జీవితకాలంలో రాజకీయాల గురించి మాట్లాడబోనని వెల్లడించారు.