ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంఎల్సి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. ఆంధ్రలో మూడు, తెలంగాణలో మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎంఎల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 16 జిల్లాల పరిధిలో పోలింగ్ కోసం 1062 కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 70మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 6,84,593మంది ఓటర్లు ఉన్నారు.
తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నిక జరుగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కూడా ఎన్నిక జరుగుతోంది. ఆ మూడు ఎన్నికల్లోనూ 90మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 973 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది.