మొగల్ సామ్రాజ్యపు ఆఖరి చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ముప్పుతిప్పలు పెట్టిన మహావీరుడు, మహారాష్ట్ర కేంద్రంగా అఖండ హైందవీ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన ఛత్రపతి శివాజీ కుమారుడు, శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘ఛావా’ సినిమా భారత చలనచిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ వాస్తవ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే దృక్పథంతో నిర్మించిన ఆ చలనచిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ విజయవాడలో చూసారు.
ఆ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ‘‘ఇవాళ వీరసావర్కర్ వర్ధంతి. ఆ సందర్భంగా మరో వీరుడి సినిమా చూసాను. ఏడున్నర ఏళ్ళ తరువాత సినిమా చూసాను. ఒక వీరుడి సినిమా చూసాననే ఆనందం కలిగింది, ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు ఆవేదనా కలిగింది. ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్‌లు మొదటితరం స్వాతంత్ర్య యోధులు. అలాంటి వారి చరిత్ర సినిమాగా తీసినందుకు దర్శక నిర్మాత లను అభినందిస్తున్నాను’’ అన్నారు.
‘‘శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర మనం చదువుకోవాలి. శంభాజీ సూరత్ నుంచి తంజావూరు వరకూ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడు. కానీ మన దేశం మీద దండయాత్రలు చేసిన వలస పాలకులను గొప్ప హీరోలుగా మన చరిత్రకారులు కల్పించారు. 60 ఏళ్ళకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ, మన రాజుల కంటె మొగలులే గొప్పవారు అనే ఆత్మన్యూనతా భావన కలిగించారు. తల్లి తండ్రి సోదరులను చంపిన ఔరంగజేబు వంటి వారిని గొప్ప పాలకులుగా ఆ పార్టీ చిత్రీకరించింది. తండ్రిని జైలుకు పంపి చంపిన చరిత్రహీనుణ్ణి ఆ పార్టీ మహానుభావుణ్ణి చేసింది’’ అంటూ కాంగ్రెస్ చేసిన చరిత్ర ద్రోహాన్ని వివరించారు.
ఆ సందర్భంగా సినిమాల గురించి సాధారణంగా మాట్లాడుతూ వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని కథానాయకులు మాదకద్రవ్యాలు తీసుకోడాన్ని చూపించకూడదని సూచించారు.