క్వాంటమ్ ఫిజిక్స్‌తో పాశ్చాత్య ప్రపంచపు మేధస్సు సుదీర్ఘకాలంగా కుస్తీ పడుతూనే ఉంది. ప్రాచ్య దేశాలలోని ప్రకృతి ఆరాధన విధానాలను సరిగ్గా అర్ధం చేసుకోలేనట్లే క్వాంటమ్ ఫిజిక్స్ మూలసూత్రాలను అవగాహన చేసుకోవడంలో తడబడుతూనే ఉంది. ఒక కణం తరంగంలా ఎలా ప్రవర్తిస్తుంది, ఒక తరంగం కణంలా ఎలా ప్రవర్తిస్తుంది అన్నది భౌతిక శాస్త్రజ్ఞులకు పెద్ద ప్రశ్న. విషయం అర్ధమైనా, దాన్ని అవగాహన చేసుకోవడంలో సమస్యకు కారణం బహుశః అబ్రహామిక్ ఆలోచనా విధానంలోనూ, భాషలోనూ ఉందేమో. అందుకే ఓపెన్‌హైమర్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు తరచుగా వేదాంతం వైపు ఆకర్షించబడ్డారు. అందుకే, ప్రపంచంలోనే అగ్రగామి కణభౌతికశాస్త్ర ప్రయోగశాల, లార్జ్ హేడ్రాన్ కొలైడర్ ఉన్న పరిశోధనాశాల – యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (సిఇఆర్ఎన్-సెర్న్)లో పరమశివ భగవానుడి నటరాజ రూపంలోని విగ్రహానికి వేదికగా నిలిచింది.
నటరాజ స్వరూపంలో శివ భగవానుడు విశ్వ నాట్యం (కాస్మిక్ డాన్స్) చేస్తూ ఉంటాడు. పార్టికల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఒక హిందూ దేవతా స్వరూపపు నాట్య భంగిమ… ఆ ప్రయోగశాల విజిటర్స్‌ను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. కొంతమంది అల్పబుద్ధులు దాన్ని యాంటీ-సైన్స్ అని వ్యాఖ్యానిస్తూ అక్కడ ఆ విగ్రహాన్ని తీసేయాలని డిమాండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి, సత్యానికి అంతకంటె దగ్గరగా మరేదీ ఉండదు. పరమేశ్వరుడి నాట్య భంగిమ సృష్టి, లయం రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. సమస్త విశ్వ చలనాన్నీ పరిపాలించే శాశ్వతమైన విశ్వ లయను ఆ నటరాజ భంగిమ సూచిస్తుంది.
ఆధునిక భౌతిక శాస్త్రానికీ, ప్రాచ్య మార్మికవాదానికీ మధ్య సంబంధాలను కనుగొన్న పాశ్చాత్య మేధావి, శాస్త్రజ్ఞుడూ అయిన ఫ్రిజాఫ్ కాఫ్కా తన ‘ది టావో ఆఫ్ ఫిజిక్స్’ పుస్తకానికి ముందుమాటలో ఇలా చెబుతాడు: ‘‘నేను ఆ సముద్ర తీరం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు నా గత అనుభవాలన్నీ సజీవంగా నా కళ్ళముందుకు వచ్చేసాయి. బాహ్య విశ్వం (ఔటర్ స్పేస్) నుంచి శక్తిపుంజాలు జాలువారుతుండడాన్ని చూసాను. అక్కడ కణాలు లయాత్మక సంస్పందనలుగా సృష్టించబడుతున్నాయి, లయం చేయబడుతున్నాయి. అనంతమైన శక్తి చేస్తున్న ఆ లయాత్మక నాట్యంలో మూలకాల కణాలన్నీ, నా శరీరంలోని కణాలతో సహా అన్నీ, పాలుపంచుకుంటున్నాయి. నేను ఆ లయను అనుభూతి చెందాను, ఆ ధ్వనిని విన్నాను. ఆ క్షణంలో అది శివతాండవం అని నాకు అవగతమైంది. హిందువుల దైవమైన నటరాజు చేసిన అపురూపమైన మహాతాండవ నాట్యం అది.’’
శివతాండవ భంగిమలోని నటరాజ మూర్తిని భారత ప్రభుత్వం సెర్న్ పరిశోధనా సంస్థకు కానుకగా ఇచ్చింది. ఆ విగ్రహాన్ని 2004 జూన్ 18న ఆవిష్కరించారు. ఆ విగ్రహం మీద ఫ్రిజాఫ్ కాప్రా ఉటంకించిన వాక్యాన్ని చెక్కారు. ‘‘వందల యేళ్ళ క్రితం భారతీయ కళాకారులు తాండవం ఆడుతున్న శివుడి మూర్తులను అద్భుతమైన శ్రేణుల్లో లోహ విగ్రహాలుగా తీర్చిదిద్దారు. మన కాలంలో భౌతికశాస్త్రవేత్తలు విశ్వనాట్యపు ఆకృతులను కనుగొనడానికి అత్యాధునిక టెక్నాలజీని ఆశ్రయించారు. అలా విశ్వనాట్యమనే అలంకారిక వర్ణన ప్రాచీన పురాణ విజ్ఞానాన్ని, మతపరమైన కళనీ, ఆధునిక భౌతిక శాస్త్రాన్నీ సమన్వయించింది.’’