ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ నగరంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సర్కండ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సర్కండ పోలీసుల సమాచారం మేరకు..
బిలాస్‌పూర్ నగరంలోని సర్కండ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో మంగళవారంనాడు ఓ బాలిక మృతి చెందిన ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురు కనిపించకుండా పోయిందంటూ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు గురైన బాలికతోపాటు నిందితుడు అదే కాలనీలోని లేబర్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1), బీఎన్‌ఎస్ 194 కింద కేసు నమోదు చేశారు. తొమ్మిది మంది అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి బాలికను తీసుకెళుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరాన్ని బాలుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారయత్నం చేయగా ఆమె తిరగబడిందని, బండరాయితో కొట్టి చంపినట్లు బాలుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు.