కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటులో ప్రతిపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, వివాదాస్పద ఫైనాన్షియర్ జార్జి సొరోస్‌తోనూ సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దేశానికి ప్రాతినిధ్యం వహించే ఎంపీ భార్యకు శత్రుదేశపు గూఢచారి సంస్థతో సంబంధాలు ఉండడం భద్రతాపరమైన ఆందోళనకరమే.
ఎంపీ భార్య అనుమానాస్పద వైఖరి:
ఎలిజబెత్ కోల్‌బర్న్ ఇస్లామాబాద్‌లో ఉన్న తరుణంలో ఒక స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేసింది. ఆ స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చి, ఆ సంస్థను నిర్వహించేది పాకిస్తాన్ గూఢచారి విభాగం ‘ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ – ఐఎస్ఐ’ అని వెల్లడయింది.
కోల్‌బర్న్‌కు సూపర్‌వైజర్‌గా వ్యవహరించిన అలీ తౌకీర్ షేక్ గతంలో పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్‌కు సలహాదారుగా పనిచేసింది. అలాగే భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా గుర్తించిన స్వచ్ఛంద సంస్థలతోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2010-15 వ్యవధిలో ఆమె ‘స్వచ్ఛంద సంస్థ పని’ పేరిట పాకిస్తాన్‌కు పలుమార్లు వెళ్ళింది. ఆ స్వచ్ఛంద సంస్థ, పేరుకు అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో పనిచేస్తుంది, కానీ భారతదేశమే లక్ష్యంగా ఐఎస్ఐ కార్యకలాపాల్లో ఆ ఎన్‌జీఓ కూడా పనిచేయడం అనుమానాలకు తావిస్తోంది.
ఎలిజబెత్ కోల్‌బర్న్ అంతర్జాతీయ ధనికుడూ, ఫైనాన్షియర్ అయిన జార్జి సొరోస్‌తో సన్నిహితంగా ఉండేది. సొరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారత అంతర్గత భద్రతా వ్యవహారాల్లో తలదూర్చిన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు. అతను ఈ ఆరోపణలపై ఇప్పటివరకూ స్పందించలేదు. కేసు న్యాయ సమీక్షలో ఉందన్న సాకు మాటున తప్పించుకుని తిరుగుతున్నాడు.
పాకిస్తాన్-బ్రిటిష్ మహిళ-జార్జి సొరోస్ కనెక్షన్:
గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య వ్యవహారం గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ‘‘ఐఎస్ఐతో ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు ఉన్న సంబంధాల గురించి, యువతను బ్రెయిన్‌వాష్ చేసి వారిని అతివాదులుగా మార్చడం గురించడానికి పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి తీసుకెళ్ళడం గురించి, ఆమె భారత పౌరసత్వం తీసుకోకుండా పుష్కర కాలంగా జాప్యం చేయడం గురించి, ఒక మతమార్పిడి కార్యక్రమంలో పాల్గొనడం గురించి, జార్జి సొరోస్ వంటి విదేశీ శక్తుల నుంచి నిధులు సేకరించడం గురించి ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలియాల్సి ఉంది. జాతీయ భద్రతను అస్థిరపరిచే చర్యలపట్ల నిరంతర అప్రమత్తత ఉండాల్సిందే. ఏదో ఒక సమయంలో జవాబుదారీతనం అవసరం. బాధ్యతను పక్కవారిమీదకు తోసేయడానికి, లేక తమపై దృష్టిని ఎదుటివారికి మళ్ళించడం అనేది అంత సులువు కాదు. ఆమె పారదర్శకత, నిజాలు తెలుసుకోవలసిన తరుణం ఆసన్నమైంది. జార్జి సొరోస్ వ్యవస్థ నేతృత్వంలో విదేశీ శక్తులు 2014లో అస్సాం కాంగ్రెస్ తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేసాయన్నది కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది’’ అని వెల్లడించారు.
పాకిస్తాన్ జాతీయుడు అలీ షేక్ మీద కేసు నమోదు చేయాలంటూ అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర డీజీపీని ఫిబ్రవరి 16న ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ భార్య ఎలిజబెత్ గొగోయ్, పాకిస్తాన్ ప్రభుత్వంతోనూ వారి గూఢచారి సంస్థ ఐఎస్ఐతోనూ సంబంధాలున్నాయని అనుమానిస్తున్న అలీ తౌకీర్ షేక్‌ల ప్రమేయంతో భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ చర్య తీసుకుంది. అలీ షేక్ మీద అస్సాం సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసారు, మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి అదనపు డీజీపీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసారు.
అస్సాం కేంద్రంగా కుట్రలా?
అలీ షేక్ అనేవాడు పాకిస్తాన్ ప్రభుత్వంలో ప్రభావశీల సంబంధాలు కలిగిన వ్యక్తి అని, అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రతినిధిగా వ్యవహరించాడని, పాక్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో సలహాదారు పాత్రలో పని చేసాడనీ తెలుస్తోంది. దాన్నిబట్టి, పాకిస్తాన్ గత ప్రవర్తనను బట్టి అలీ షేక్ అస్సాం ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొట్టడానికి ప్రయత్నించాడని అంచనా వేస్తున్నారు. అస్సాం రాష్ట్రం, భారత ప్రభుత్వం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి విదేశీయుడైన అలీ షేక్ ప్రయత్నించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
అలీ షేక్ సామాజిక మాధ్యమాల కార్యకలాపాల తనిఖీలో… అతనికీ ఎలిజబెత్ గొగోయ్‌కూ సంబంధాలు ఉన్నాయని తేలింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి పనిచేయడంతో పాటు అలీ షేక్ ‘లీడ్ పాకిస్తాన్’ అనే సంస్థ నడుపుతున్నాడు. ఎలిజబెత్ ఇస్లామామాబాద్‌లో ఉండే రోజుల్లో ఆ సంస్థలో ప్రధాన పాత్రధారిగా ఉండేది. అంతేకాదు, భారత్-పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ పనిచేస్తున్న క్లైమేట్ అండ్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (సిడికెఎన్) అనే అంతర్జాతీయ పర్యావరణ సంస్థలో వారిద్దరూ కలిసి పనిచేసారు.
పాకిస్తాన్‌కు చెందిన ప్రభావశీల వ్యక్తి ఒకరు భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో బహిరంగంగానే జోక్యం చేసుకుంటూ ఉండడం దేశ భద్రతకు, అంతర్గత వ్యవహారాలకూ ముప్పు కలిగిస్తుందని అస్సాం మంత్రివర్గం ఆందోళన చెందుతోంది. పర్యావరణ సంస్థ ముసుగులో వారు రాష్ట్రానికీ, దేశానికీ చేటు కలిగిస్తారని అనుమానిస్తోంది. అలీ షేక్ మీద కేసు నమోదు చేయాలని, వారి చర్యల వెనుక ఇంకేదైనా భారీ కుట్ర ఉందా అని దర్యాప్తు జరపాలనీ అస్సాం ప్రభుత్వం ఆదేశించింది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ తీవ్రమైన విషయాన్ని దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం రాజకీయ అజెండాతో వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అస్సాం బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుందని గౌరవ్ గొగోయ్ ఆరోపిస్తున్నారు. చిత్రంగా ఎలిజబెత్‌కు పాకిస్తానీ ఎన్‌జీఓతో సంబంధం ఉందా లేదా అన్న ప్రశ్నకు మాత్రం నేరుగా జవాబు చెప్పడం లేదు. ఢిల్లీలోనూ, పాలస్తీనాలోనూ పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి తను ఎందుకు వెళ్ళాడన్న సంగతిని కూడా గౌరవ్ గొగోయ్ వెల్లడించలేదు. ఐతే తమ దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి సంచలనాత్మక విషయాలు బైటపడుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.