ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ జెండా రెపరెపలాడబోతోందన్నారు. ఏపీలోనూ చాలా కాలం తరవాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.
హిందీని తమిళులపై రుద్దాలని చూస్తే యుద్ధం చేయడానికైనా సిద్దమేనని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ చేసిన వ్యాఖ్యల తరవాత అమిత్ షా కొయంబత్తూరు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర విద్యావిధానం ప్రకారం స్థానిక భాషతోపాటు, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే తాము ద్విభాషా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య వివాదాన్ని రాజేసింది.