144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా పర్వం నేటితో ముగియనుంది. ఆ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమంలో ఆఖరి ‘షాహీ స్నాన్’ – పవిత్ర స్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. గంగా యమునా సరస్వతీ నదుల సంగమ క్షేత్రంలో భక్తజన సాగరం సంగమిస్తోన్న అపురూప సందర్భమిది.
ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభమేళా పౌష్య పూర్ణిమ అంటే జనవరి 13న మొదలైంది. నేడు మహాశివరాత్రి పర్వదినాన ముగుస్తోంది. ఈ 45 రోజుల్లో ఇప్పటివరకూ 65కోట్లమందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
మహాకుంభమేళాలో ఆఖరి పవిత్ర స్నానం సందర్భంగా ఇవాళ భక్తుల మీద పుష్పవర్షం కురిపించారు. ‘‘ఇవాళ్టితో మహాకుంభమేళా ముగుస్తున్నందున భారీసంఖ్యలో భక్తులు పవిత్ర స్నానం కోసం బారులు తీరారు. గత అర్ధరాత్రి నుంచీ భక్తుల రాక గణనీయంగా పెరిగిపోయింది. అయితే మా ఏర్పాట్ల వల్ల భక్తుల రాకపోకలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా సాగిపోతున్నాయి. మహాశివరాత్రి, మహాకుంభమేళా ఆఖరి రోజు రెండూ కలిసి రావడంతో భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. కుంభమేళా ప్రాంతంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు’’ అని మహాకుంభ్ ఎస్ఎస్పి రాజేష్ ద్వివేదీ వివరించారు.
మహాకుంభమేళా జనవరి 13న మొదటి అమృత స్నానంతో ప్రారంభమైంది. జనవరి 14 మకర సంక్రాంతి నాడు, జనవరి 29 మౌని అమావాస్య నాడు, ఫిబ్రవరి 3 వసంత పంచమి నాడు, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ నాడు భక్తులు అమృత స్నానాలు చేసారు. ఆఖరి అమృత స్నానం ఫిబ్రవరి 26, అంటే ఈరోజు మహాశివరాత్రి నాడు పూర్తవడంతో మహాకుంభమేళా ముగుస్తుంది.