మహాశివరాత్రి సందర్భంగా తెలుగునేల శివనామస్మరణతో మార్మోగుతోంది. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ, పంచారామాలు, ఇతర ప్రముఖ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నదులు, సముద్రాలు, సెలయేళ్ళ వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలోని శివాలయాలకు వెళ్ళి పార్వతీపరమేశ్వరులను అర్చిస్తున్నారు.
శ్రీశైలంలో మంగళవారం రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజున ఆదిదంపతులుకు గజ వాహన సేవ నిర్వహించారు. నేటి సాయంత్రం ప్రభోత్సవం, రాత్రికి నంది వాహనంపై నుంచి స్వామిఅమ్మవార్లు భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి పదిగంటలకు రుద్రాభిషేకం, ఆ తర్వాత పాగాలంకరణ చేస్తారు. ఆ తర్వాత ఆదిదంపతులకు కళ్యాణం జరుపుతారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
కోటప్పకొండపై మహా శివరాత్రి వేడుకలు వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము 2 గంటలకు బిందెతీర్థంతో శ్రీ త్రికోటేశ్వర స్వామికి తొలిపూజ చేశారు.