ప్రతీయేటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం హిందువులకు అనూచానంగా వస్తున్న సంప్రదాయం. శివరాత్రి నాడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఆనాడు శివభగవానుణ్ణి సాకారంగా లేక లింగాకారంగా పూజించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది.
శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం చేయడం ద్వారా ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చునని వాయు పురాణం చెబుతోంది. అగ్ని స్వరూపుడు, సమస్త లయకారుడూ అయిన పరమశివుడు అభిషేకంతో శాంతిని పొందుతాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆపోవా ఇదగ్మ్ సర్వమ్ విశ్వా భూతాన్యాస అని వేదవాక్యం. అంటే ఈ విశ్వంలోని అన్ని అంశాలకూ జలమే ఆధారభూతం. అటువంటి జలాలతో శివుడికి అభిషేకం చేయడం మహత్తరమైన విషయం. నిత్య, పక్ష, మాస, మహా, యోగ శివరాత్రి అనే ఐదు శివరాత్రులలో విశిష్ఠమైనది మహాశివరాత్రి. ఆనాడు పరమశివ భగవానుడికి అభిషేకం చేయడం అనంత పుణ్యఫలాలను ఇస్తుంది.
అభిషేక వేళ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కోటి బిల్వార్చన, సహస్ర నామార్చన చేయడం పరిపాటి. యజుర్వేదంలోని రుద్రాధ్యాయ మంత్రాలతో ఆ పూజా విధానాన్ని నిర్వహిస్తారు. అయితే శివుడు భక్తసులభుడు. ఒక ఆకు, ఒక పువ్వు, రెండు చుక్కల నీళ్ళు ఇలా ఏది సమర్పించినా మనస్ఫూర్తిగా సభక్తికంగా అర్చిస్తే కనికరించేస్తాడు ఆ ఆదిశివుడు. మహాశివరాత్రి పర్వదినాన జాగరణ చేసి స్వామినే మనసులో నింపుకుంటే సమస్త ఐశ్వర్యాలూ వరించినట్లే.