వివాదాస్పద ఢిల్లీ మద్యం విధానంపై చాలాకాలంగా పక్కన పెట్టేసి ఉంచిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ఎట్టకేలకు ఢిల్లీ శాసనసభలో కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం ఆర్థిక అవకతవకలకు, అవినీతి కుంభకోణాలకూ చిరునామాగా నిలిచింది. దానిపై కాగ్ నివేదిక బైటపెట్టిన వివరాలతో దేశ రాజధానిలో రాజకీయ దుమారం చెలరేగింది.
ఢిల్లీ మద్యం విధానంపై కాగ్ నివేదికలో ఏముంది?
కాగ్ నివేదిక ప్రకారం, 2021-22 ఢిల్లీ మద్యం విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఏకస్వామ్యానికి దారితీసేలా ఉంది. నిజానికి ఆ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఆప్ ప్రభుత్వం చెప్పిన ప్రధాన కారణాలు మద్యం అమ్మకాల విధానాన్ని సరళీకరించడం, ఆదాయం పెంచడం. అయితే మద్యం తయారీదారులు, టోకు వ్యాపారుల మధ్య ప్రత్యేక ఒప్పందం కుదిరిన సంగతిని కాగ్ నివేదిక బైటపెట్టింది. కొంతమంది గుత్తేదారులు మార్కెట్‌ను మోసగించారు, అవినీతి పెరిగిపోయింది, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది అని కాగం ఆ నివేదికలో అన్ని గణాంకాలతోనూ నిరూపించింది.
లైసెన్సుదారుల ఆర్థిక సమర్ధతను, నిర్వహణా నైపుణ్యాలనూ అంచనా వేయడంలో అబ్కారీ శాఖ పూర్తిగా విఫలమైందని కాగ్ నివేదిక ఎండగట్టింది. దానివల్ల రాష్ట్ర ఖజానా భారీ నష్టాలను మూటగట్టుకుని ఉండేదని తేల్చిచెప్పింది. మద్యం పరీక్షా కేంద్రాల ఏర్పాటు, నాణ్యత పరిశీలన కోసం బ్యాచ్ టెస్టింగ్, పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు వంటి కీలకమైన అంశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
ఆప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందన్న సీఎం రేఖా గుప్తా:
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2017-18 నుంచీ కాగ్ నివేదికలను తొక్కిపట్టి ఉంచింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను అణగదొక్కేసింది అంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, తన ముందరి ఆప్ సర్కారుపై విరుచుకుపడింది. ‘‘2017-18 నుంచి నేటివరకూ ఢిల్లీ అసెంబ్లీ ముందు ఒక్కసారైనా కాగ్ నివేదికను ప్రవేశపెట్టకపోవడం దిగ్భ్రాంతికరం. మేము ఎన్నోసార్లు కాగ్ నివేదిక కోసం అడిగాము, కానీ ఆప్ ప్రభుత్వం ఈ నివేదికలను పక్కన పెట్టేసి ఢిల్లీ ప్రజలను చీకట్లో ఉంచేసింది. ఈ నివేదికలను దాచిఉంచడం నేరం’’ అని ముఖ్యమంత్రి రేఖా గుప్తా వ్యాఖ్యానించారు.
ప్రజారోగ్యం, వాహనాల వల్ల వాయుకాలుష్యం, ఢిల్లీ ఆర్టీసీ వంటి అంశాలపై ఇన్నాళ్ళుగా వెలుగులోకి రాకుండా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తొక్కిపట్టి ఉంచిన 14 కాగ్ నివేదికలను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ శాసనసభ ముందు ప్రవేశపెట్టనుంది.
మద్యం విధానంపై కాగ్ నివేదికను శాసనసభ ముందు ప్రవేశపెట్టగానే బీజేపీ దళం గత కేజ్రీవాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని ఆప్ సర్కారు వ్యవస్థీకృతం చేసిందని బీజేపీ సీనియర్ ఎంఎల్ఎ సతీష్ ఉపాధ్యాయ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్, ఆతిషీ మార్లేనా, సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి వంటి నేతలందరినీ జవాబుదారీ చేయాలని డిమాండ్ చేసారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, ‘ఇన్నేళ్ళుగా 14 కాగ్ నివేదికలను తొక్కిపట్టి ఉంచడమే ఆప్ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందనడానికి నిదర్శనం’ అని విమర్శించారు.
కేజ్రీవాల్ “అద్దాల మేడ” వివాదం మళ్ళీ తెర మీదకు:
పెండింగ్ ఉన్న కాగ్ నివేదికల్లో ముఖ్యమైనది కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని విలాసవంతంగా తీర్చిదిద్దడానికి అయిన ఖర్చుల మీద నివేదిక. సీఎం అధికార నివాసం మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం 2020లో మొదట మంజూరు చేసిన మొత్తం రూ 7.61 కోట్లు. 2022కల్లా అంటే కేవలం రెండేళ్ళలో ఆ వ్యయం 342శాతం పెరిగి సుమారు 34కోట్లకు చేరుకుంది. దానిపై కాగ్ నివేదికలో ప్లానింగ్, టెండర్లు పిలవడం, నిర్మాణం వంటి ప్రతీ దశలోనూ అవినీతి జరిగిందని వెల్లడయింది.
ఇవాళ, మద్యం విధానం మీద కాగ్ నివేదికను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఆప్ ఎంఎల్ఎలు శాసనసభలో గందరగోళం సృష్టించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగిస్తుండగా జైభీమ్ అంటూ నినాదాలు చేసారు. దాంతో స్పీకర్ విజేందర్ గుప్తా సభలో ప్రతిపక్ష నేత ఆతిషీ మార్లేనా, గోపాల్ రాయ్ సహా 12మంది ఆప్ ఎంఎల్ఏలను సస్పెండ్ చేసారు.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా