మండలిలో వాడివేడి చర్చ సాగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మంది యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లను బెదిరించి పదవీ కాలం పూర్తి కాకుండానే తొలగించారంటూ మాజీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేశ్ తిప్పికొట్టారు. వీసీల తొలగింపుపై విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఒక్క ఆధారం ఇచ్చినా విచారణ కమిటీ వేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు సభలో ఎలా చెబుతారంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. సభ్యులకు ఇంగ్లీష్ సరిగా అర్థం కావడం లేదని సభాపతి దృష్టికి మంత్రి లోకేశ్ తీసుకెళ్లారు. ఇంగ్లీష్ కూడా అర్థం కాని వైసీపీ సభ్యులు, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం కావాలంటూ గొడవ చేస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. 4 లక్షల ఉద్యోగాల కల్పనకు అవసరమైన పరిశ్రమల స్థాపన జరుగుతోందని మాత్రమే చెప్పినట్లు మంత్రి లోకేశ్ సభలో ప్రకటించారు. ఈ విషయాన్ని సభాపతి బుక్ లెట్లు తెప్పించి పరిశీలించారు.
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇంత వరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ పీడీఎఫ్ సభ్యులు మంత్రి నారా లోకేశ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే నోటిఫికేషన్ ఉంటుందని, వచ్చే విద్యాసంవత్సరం బడులు తెరిచే సమయానికి నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా