వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో జైలు నుంచే వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం చి 11 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.
వంశీని నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. పటమట పోలీసులు, జైలు నుంచి వంశీని కస్టడీలోకి తీసుకుని భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని పోలీసులు విచారించనున్నారు.
కిడ్నాప్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో పాటు మరో భూకబ్జా కేసు నమోదైంది. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. వంశీతో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు.
గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అక్రమ మైనింగ్, బెదిరింపులుపై సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ను చీఫ్ గా నియమించిన ప్రభుత్వం , ఏలూరు ఎస్పీ కొమ్మా ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసంహా కిషోర్ ను సభ్యులుగా నియమించింది.