ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో మరో రికార్డు నమోదు కాబోతోంది. ఇప్పటి వరకు మహాకుంభమేళాకు 63 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో 63 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభ్ నగర్ ప్రాంతంలో 24 గంటలూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించిన 15 వేల మంది కార్మికులు గిన్నిస్ రికార్డు నమోదు చేయబోతున్నారు.
సోమవారం ప్రయాగ్‌రాజ్ మహాకుంభనగర్‌లో ఒకేసారి 15 వేల మంది కార్మికులు చీపురు పట్టారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు రికార్డు చేశారు. 2019లో గరిష్ఠంగా 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు చీపురు పట్టి పనులు చేశారు. ఆ రికార్డును తాజాగా బద్దలు కొట్టారు. అయితే మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు.
జనవరి 13 నుంచి త్రివేణి సంగమం ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతోన్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. మొత్తం 65 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ఇప్పటికే 63 కోట్ల మంది పవిత్ర స్నానాలు పూర్తి చేశారు. రేపు శివరాత్రి పర్వదినం కావడంతో 2 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేశారు.