మహాశివరాత్రి రోజు ఆఖరి అమృత్ స్నానం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. రేపు చివరి అమృత్ స్నానం కావడంతో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా కోటి మందికిపైగా భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది.
ప్రయాగ్‌రాజ్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ప్రభుత్వం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’ ప్రకటించింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత పూర్తిగా ఆంక్షలు విధించనున్నారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించారు.
చివరి రోజు అమృత స్నానాల కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. లక్నో, ప్రతాప్‌గఢ్ వైపు నుంచి వచ్చే యాత్రికుల కోసం ఫాఫామౌ ఘాట్‌ను కేటాయించారు.
రేవాన్, బండా, చిత్రకూట్, మీర్జాపూర్ వైపు నుంచి వచ్చే వారికోసం ఆరైల్ ఘాట్‌ను రిజర్వ్ చేశారు. కౌశాంబి నుంచి వచ్చే భక్తుల కోసం సంగం ఘాట్ కేటాయించారు.
మకర సంక్రాంతి నాడు జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది.ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో దాదాపు 64 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.