పాకిస్తాన్ ప్రభుత్వం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో చేపట్టిన 4700 మెగావాట్ల దాసు హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కొన్నిరోజుల నుంచి భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ పరిహారమూ లేకుండా భూమిని కోల్పోయిన వేలాది నిర్వాసితులు రహదారుల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం వందలాది ఇళ్ళను కూల్చేసారు. ఎన్నో యెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇళ్ళ, భూముల యజమానులకు ఎలాంటి పరిహారమూ చెల్లించకుండానే వాళ్ళను ఖాళీ చేయించేసారు. తుపాకులతో బెదిరించి సామాన్య ప్రజలను తమతమ ఇళ్ళనుంచి, భూముల నుంచి ఖాళీ చేయించారు. ఆ స్థలాన్ని చైనా ఇంజనీర్లు, కార్మికులకు అప్పజెప్పారు. నిజానికి మొదట్లో చర్చల సమయంలో ప్రజలు పెట్టిన 13 డిమాండ్లకు ఒప్పుకున్నారు. కానీ వాటిలో ఏ ఒక్క డిమాండ్‌నూ పూర్తిచేయలేదని, రాతపూర్వకంగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని సైతం ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో గిల్గిట్ – బాల్టిస్తాన్ ప్రాంతంలో దయామెర్-బాషా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం పురుడు పోసుకుంటోంది. వేలాది ఆందోళనకారులు సుమారు పదిరోజులుగా చిలాస్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పునరావాసం కల్పించాలనీ తాము పెట్టిన డిమాండ్లను అమలు చేయాలని వారు కోరుతున్నారు. మొత్తంగా 31 డిమాండ్లతో ఒక పత్రం రూపొందించారు. ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని వారు ఆందోళనలు చేస్తున్నారు.
ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని ఎగువ కోహిస్తాన్ నివాసులు దాసు ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నిన్న సోమవారం నాడు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కోమిలా బజార్ ప్రాంతంలో దుకాణాలు, కార్యాలయాలు మూసివేసారు, రహదారులను నిర్బంధించారు. అంతకుముందు ఆదివారం రోజు కూడా వందలాది నిరసనకారులు ఎగువ కోహిస్తాన్ ప్రాంతం అంతటా ఆందోళన నిర్వహించారు. వ్యాపారులు, రవాణా రంగ కార్మికులు సైతం తమ సేవలను నిలిపివేసారు. కోమిలా, దాసు బజార్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పాకిస్తాన్ ప్రభుత్వపు వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ తమ 13 డిమాండ్లకు ఒప్పుకుందని, కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదనీ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం కూలగొట్టిన ఇళ్ళకు పరిహారం చెల్లించడం, స్థానిక ప్రజల కోసం ఆస్పత్రి నిర్మాణం, ప్రాజెక్టులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం వారి ప్రధానమైన డిమాండ్లు.
గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో దయామెర్-బాషా డామ్ ప్రతినిధులు, కశ్మీర్ వ్యవహారాల మంత్రి కలిసి ఆదివారం నాడు చిలాస్ ప్రాంతంలో స్థానిక ప్రజలతో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వ్యవహారం మరింత పీటముడి బిగుసుకుంది. చిలాస్ ప్రాంత వాసులు గిల్గిట్ బాల్టిస్తాన్లోని మిగతా ప్రాంతాల ప్రజలను సైతం కూడగడుతున్నారు. రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల్లో వారందరూ కలిసి నిరసన తెలియజేస్తారు.
నిజానికి ప్రభుత్వం స్థానిక ప్రజలతో 2010లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో మొత్తం 31 డిమాండ్లకు ఒప్పుకుంది. అయితే 15ఏళ్ళు గడిచిపోయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ నేపథ్యంలో తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలమైనందున, పోరాటం కొనసాగించాలని నిర్వాసితులు నిర్ణయించుకున్నారు.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా