ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి సోమవారం త్రివేణీ సంగమం వద్ద భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. ఆ సందర్భంగా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించాలన్న డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని సనాతన ధర్మ ప్రచారానికి మాత్రమే ఉపయోగించాలని ఆయన స్పష్టం చేసారు. ఆలయాల నిర్వహణకు ఆయన ప్రజలు-పురోహితులు-పూజారులు అన్న వ్యవస్థ నమూనాను ప్రతిపాదించారు.
దేవాలయాలను ప్రభుత్వం నుంచి విముక్తం చేయాలన్న డిమాండ్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. పలువురు ధార్మిక నాయకులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఆ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నారు. కంచి స్వామి కూడా దానికే అండగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాగరాజ్ మహాకుంభనగర్‌లోని సెక్టార్ 20లో కంచి మఠం శిబిరంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ ‘‘ప్రతీ కుంభమేళాలో ఒక డిమాండ్ ప్రస్తావనకు వస్తుంది. అది కాలక్రమంలో నెరవేరుతుంది. 2013లో రామమందిరం కోసం డిమాండ్ చేసారు. ఇప్పుడు 2025 మహాకుంభమేళాలో దేవాలయాల విముక్తి కోసం ఇచ్చిన పిలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది’’ అన్నారు.
విజయేంద్ర సరస్వతి మూడు మౌలికమైన డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించారు. అవి….:
(1) దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలనూ పునరుద్ధరించాలి.
(2) వాటిలో పూజా కార్యక్రమాలు, విహిత కర్మలు సక్రమంగా నిర్వహించాలి.
(3) దేవాలయాల రాబడి వాటివద్దనే ఉంచాలి, వేరే పనులకు దారి మళ్ళించకూడదు.
ఆలయాల రాబడిని సనాతన ధర్మ ప్రచారానికి, వేదవిద్య బోధనకు, గురుకులాల ఏర్పాటుకు, గోశాలల ద్వారా గో సంరక్షణకు, శాస్త్రీయ సంప్రదాయ కళలు-సంగీత ప్రచారానికీ ఉపయోగించాలని విజయేంద్ర సరస్వతి వక్కాణించారు.
ఆలయాల నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ జోక్యం:
దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ వల్ల కలుగుతున్న అనర్థాల గురించి హిందూ సంస్థలు, కార్యకర్తలు ఎన్నో యేళ్ళుగా మాట్లాడుతున్నారు. గుడుల నిర్వహణలో లోపాలు, నిధుల దుర్వినియోగం, దేవాలయ ఆస్తుల అక్రమ ఆక్రమణలు, ఆగమశాస్త్రాలను పట్టించుకోకపోవడం, రాజకీయ జోక్యం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు మైనారిటీ బుజ్జగింపు చర్యల కోసం ప్రభుత్వ విధానాలతో దేవాలయ వ్యవస్థను కుంగదీసేస్తున్నారన్న ఆరోపణలు ఏనాటి నుంచో ఉన్నాయి. గుడుల్లో దర్శనం చేసుకోడానికి భారీ మొత్తాల్లో రుసుములు వసూలు చేస్తున్నారు. అవి పేద భక్తులకు దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నాయి.
దేవాలయాల విముక్తి ఉద్యమానికి ధార్మిక సంస్థలు, కార్యకర్తలు, ఆచార్యులు అండగా నిలుస్తున్నారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్, దేవాలయాల ఉద్యమ కార్యకర్త టి.ఆర్ రమేష్, హిందూ మున్నాని సంస్థ దేవాలయాల విముక్తి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ‘నారసింహ వారాహీ బ్రిగేడ్’ పేరుతో తమ పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసారు. 2024 నవంబర్ 3న ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘నేను అన్ని మతాలనూ గౌరవిస్తాను. కానీ నా ధర్మం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటాను. సనాతన ధర్మాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శించేవారు, దానిగురించి అగౌరవంగా ప్రేలాపనలు చేసే వారు తమ చర్యలకు పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే మా పార్టీలో ‘నారసింహ వారాహి బ్రిగేడ్’ పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేస్తున్నాను’’ అని ప్రకటించారు.
ఆలయ నిర్వహణకు కొత్త నమూనా:
దేవాలయాలను ప్రభుత్వ హస్తాల నుంచి విముక్తం చేసాక వాటి నిర్వహణ ఎలా జరగాలన్న దానిగురించి కంచి మఠం శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి స్వామి ఒక నమూనాను ప్రతిపాదించారు. దాని ప్రకారం ‘పిపిపి’ విధానంలో ప్రజలు-పురోహితులు-పూజారులు అనే మూడంచెల వ్యవస్థ ఉండాలి.
ప్రజలు (భక్తులు) : గుడి నిర్వహణలు ప్రజల భాగస్వామ్యం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం వస్తాయి.
పురోహితులు: వారు దేవాలయంలో పాటించవలసిన ఆచారాలు, సంప్రదాయాలను పర్యవేక్షించాలి.
పూజారులు: దేవాలయంలో రోజువారీ నిర్వహణ బాధ్యతలు వహించాలి. ఆలయ ఆస్తులను పరిరక్షించాలి.
ఈ ‘త్రివేణీ’ పద్ధతి సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. దేశంలోని ఆలయాల స్థితిగతులను మెరుగు పరుస్తుందని విజయేంద్ర సరస్వతి స్వామి భావన. ‘‘ప్రతీ పంచాయతీలోనూ ఒక పూజారి ఉండాలి, ప్రతీ గ్రామంలోనూ తిరుపతి గుడి లాంటి ఆలయం ఉండాలి’’ అని ఆయన సూచించారు.
యువత భాగస్వామ్యం, కుంభమేళా ఆలోచనల డాక్యుమెంటేషన్:
ఆధునిక యువతరంలో ధార్మిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతోందన్న ఆందోళనను కంచి స్వామి కొట్టిపడేసారు. సనాతన ధర్మంలో తమ విశ్వాసాన్ని చాటిచెప్పడానికి యువతరం ఉత్సాహంగా ముందుకొస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘మహాకుంభమేళాకు పెద్దసంఖ్యలో యువతీ యువకులు వస్తుండడాన్ని నేను చూసాను. వారు పూర్తి భక్తిశ్రద్ధలతో ఉన్నారు. నుదుటిపై తిలకం ధరిస్తున్నారు. ఈ దేశంలో ఇంకా సనాతన ధర్మంపై విశ్వాసం బలంగా ఉంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలం. సురక్షితం, ఆధ్యాత్మికం అయిన భారతదేశం ప్రపంచంలోనే ఓ గొప్ప స్థానాన్ని పొందుతుంది’’ అని స్వామి అన్నారు.
మహాకుంభమేళా నిర్వహణలో సాధించిన విజయాలను, నేర్చుకున్న పాఠాలనూ వ్యవస్థీకృతంగా నమోదు చేయాలని, తద్వారా అటువంటి కార్యకలాపాల కోసం ముందస్తుగా ప్రణాళికలు రచించుకోవడం సులువు అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్ వంటివి కూడా సహాయం చేయవచ్చని విజయేంద్ర సరస్వతి సూచించారు.