మహాకుంభమేళాలో ఏర్పాట్లు సరిగా లేవంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. మహాకుంభమేళాలో ఎవరికి కావాల్సింది వారికి లభించిందని ఆయన ఎద్దేవా చేశారు. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారని, రాబందులకు అక్కడ శవాలు దొరికాయన్నారు. పందులకు అపరిశుభ్రత లభించింది. ఇక సున్నిత స్వభావులకు సంబంధ బాంధవ్యాలు, భక్తులకు పరిశుభ్రత, వ్యాపారులకు వ్యాపారం దొరికిందని, ప్రతిపక్ష నేత సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్పై తీవ్ర విమర్శలు చేశారు.
2013లో మీ పాలనలో జరిగిన కుంభమేళాకు సనాతన ధర్మాన్ని పాటించని వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. ఆనాడు కనీసం త్రివేణి సంగమంలో నీరు కూడా లేదని, మారిషష్ ప్రధాని పుణ్య స్నానం చేసేందుకు నిరాకరించిన విషయాన్ని సీఎం యోగీ గుర్తుచేశారు.
ఒక కులానికి చెందిన వారిని మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను యోగీ ఖండించారు. భక్తితో వెళ్లేవారిని ఎవరినీ అడ్డుకోలేదని, అరాచకాలు చేయాలని చూసిన వారికి అక్కడ ప్రవేశం లేదని యోగీ స్పష్టం చేశారు. మీలాగా మేము మతంలో ఆటలాడలేదని యోగీ చురకలు వేశారు.
మహాకుంభమేళాకు ఇప్పటి వరకు 63 కోట్ల మంది భక్తులు వచ్చారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.రెండు రోజుల్లో కుంభమేళా ముగియనుంది. రేపు శివరాత్రి సంబర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలకు వస్తారని ఏర్పాట్లు చేశారు. కాశీకి వచ్చే వేలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వెళుతున్నారు. దీంతో ఆ మార్గంలో తీవ్రమైన రద్దీ ఏర్పడింది.