ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం మహాకుంభమేళాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లూ చక్కగా చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమర్ధ నిర్వహణ అందరినీ విస్మయపరుస్తోంది. ఆ ఏర్పాట్లు ఎలా చేసారో అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి నారాయణ బృందం ప్రయాగరాజ్ వెళ్ళింది.
2027లో గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఆ సందర్భంగా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న విషయాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర బృందం ప్రయాగ వెళ్ళింది. ఆ బృందంలో మంత్రి నారాయణతో పాటు మునిసిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ ఉన్నారు.
మంత్రి నారాయణ బృందం ఇవాళ సాయంత్రం ప్రయాగరాజ్‌లోని కుంభమేళా అథారిటీ కార్యాలయాన్ని సందర్శించింది. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు తదితర విషయాల గురించి రాష్ట్ర బృందానికి కుంభమేళా ప్రత్యేక అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్ర బృందం కుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. తర్వాత స్నాన ఘట్టాల వద్దకు వెళ్ళారు. అక్కడి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.