144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. నిన్న ఆదివారం పూర్తయేనాటికి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 62కోట్లు దాటింది. ఆదివారం నాడు గంగా క్షేత్రంలో మహాకుంభనగర్లో పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన రెండు వేల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసారు. హర్ హర్ గంగే, భం భం భోలే నినాదాలతో పాటు జై శ్రీరామ్ అంటూ భక్తిపారవశ్యంతో నినాదాలు చేసారు.
కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళా గురించి తీవ్రమైన, పరుషమైన వ్యాఖ్యలు చేసారు. అది మహాకుంభ్ కాదు మృత్యుకుంభ్ అంటూ అవహేళన చేసారు. దానికి విరుద్ధంగా, అదే రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి వెళ్ళి పవిత్ర స్నానాలు చేస్తుండడం విశేషం.
తాజాగా అసన్సోల్ నుంచి 40 బస్సుల్లో 2వేల మంది భక్తులు ఒక బృందంగా ఏర్పడి ఆదివారం నాడు ప్రయాగరాజ్ చేరుకున్నారు. గంగా-యమునా-సరస్వతీ నదుల త్రివేణీ సంగమ ప్రదేశంలో నదీదేవతలకు నమస్కరించి పవిత్ర స్నానాలు ఆచరించారు. సాధు సంతులతో కలిసి కుంభమేళా ఆచార సంప్రదాయాలను పాటించారు. చివరిగా భగవాన్ శ్రీరాముడి నామస్మరణంతో సంగమ క్షేత్రాన్ని హోరెత్తించారు. అయోధ్యకు చెందిన ప్రముఖ సాధువు, రఘువంశ్ సంకల్ప్ సేవ అధ్యక్షుడు అయిన స్వామి దిలీప్ దాస్ త్యాగి ఈ విషయాలను వివరించారు.
అసన్సోల్ నుంచి కుంభమేళాకు వెళ్లిన బెంగాలీ భక్తుల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్ తమ యాత్ర ప్రత్యేకమైనదని వివరించారు. ‘‘మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సమ్మేళనం. ఆ మహోత్సవాన్ని నేత్రపర్వంగా చూడడానికి మేమందరం ఎంతో ఆత్రంగా ఉన్నాం’’ అని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్దదీ, సుదీర్ఘ కాలచక్రంలో ఒకసారి వచ్చేదీ అయిన మహాకుంభమేళా లాంటి విశిష్ఠమైన వేడుకకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఎక్కడా వీసమెత్తు సమస్య లేకుండా, భక్తులందరూ ప్రశాంత మనస్సుతో తమ ఆధ్యాత్మిక చింతనను నెరవేర్చుకునేందుకు అవసరమైన పవిత్ర వాతావరణాన్ని కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్ సఫలమయ్యారు. ఏ మతంలోనైనా ఇంతకు మించిన మహాజనసముద్రం ఉండబోరు. అలాంటి విశేషమైన మహాకుంభమేళాకు ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో ఆదిత్యనాథ్ సర్కారు విజయవంతమైంది.
ఆ ఏర్పాట్లు చూసి స్ఫూర్తి పొంది, పశ్చిమ బెంగాల్ నుంచి వేలాది మంది భక్తులు ప్రయాగరాజ్కు తరలివచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని తమ కళ్ళతో తాము స్వయంగా చూసి ఆనందానుభూతులను పొందారు. యజ్ఞయాగాదులు, ప్రత్యేక పూజా కార్యక్రమాలూ నిర్వహించుకున్నారు. తమ పితృదేవతల కోసం గంగమ్మ ఒడిలో తర్పణాలు వదిలారు. ‘మహాకుంభమేళా కాదు, మృత్యుకుంభమేళా’ అని తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే వ్యాఖ్యానించినా వారి అచంచల భక్తితత్పరతలు వీసమెత్తయినా తొణకలేదు. ‘‘దేశం నలుమూలల నుంచి 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ప్రయాగరాజ్ వస్తుంటే మేమెందుకు రాకుండా ఉండాలి?’’ అని ప్రశ్నించారు వారు.