మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్ బయల్దేరిన బీజేపీ మైనారిటీ నాయకురాలు నాజియా ఎలాహీ ఖాన్ బృందం మీద కొందరు ముస్లిం దుండగులు దాడి చేసారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటా దగ్గర జరిగిన ఆ దాడి కారణంగా కారు యాక్సిడెంట్ అయింది. ఆ కారులో ఉన్న ప్రియా చతుర్వేదీ అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
జరిగిన సంఘటనపై నాజియా ఎలాహీ ఖాన్ ఎక్స్ మాధ్యమం ద్వారా ఒక వీడియో ప్రకటన విడుదల చేసింది. తమపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళికతో చేసినదేనని ఆమె ఆ ప్రకటనలో ఆరోపించింది. కొంతదూరం నుంచి తమను వెంబడిస్తూ వచ్చిన దుండగులు దాడి చేసారని, ఫలితంగానే కారు ప్రమాదానికి గురయిందనీ నాజియా వివరించింది. నాజియాకు, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న 19ఏళ్ళ ప్రియా చతుర్వేది అనే స్నేహితురాలికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రియా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
నాజియా ఎలాహీ ఖాన్‌కు అతివాద ముస్లిముల నుంచి బెదిరింపులు గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. బీజేపీకి మద్దతిస్తున్నందుకు ఆమెను తీవ్రంగా బెదిరించేవారు. గతేడాది బెంగాల్‌లో ఆమెను దైవదూషణ ఆరోపణలపై అరెస్ట్ చేసారు కూడా. 2024 ఆగస్ట్ 3న ‘న్యూస్ గ్యాలరీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో నాజియా మత అతివాదం గురించి మాట్లాడారన్న ఆరోపణలు వచ్చాయి. వాటి ఆధారంగా కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేసారు. తాజాగా ఆమెపై జరిగిన దాడిని కూడా కలుపుకుని చూస్తే ముస్లింలలో అతివాదులను ప్రశ్నించే వ్యక్తులను సహించలేకపోవడం, వారిని బెదిరించడం లేదా వారి ప్రాణాలకు ముప్పు కల్పించడం వంటి ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో అర్ధమవుతుంది.
ఆ దాడి తర్వాత నాజియా వెంటనే స్పందించింది. జరిగిన దాడి ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కోరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యూపీ పోలీసులు, ఎటా పోలీసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర డీజీపీ అందరూ స్పందించి జోక్యం చేసుకోవాలని, తనలాంటి వారికి భద్రత కల్పించాలనీ ఆమె కోరుతోంది.