అమెరికా టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. ట్రంప్ మరోసారి పలు దేశాల దిగుమతులపై సుంకాలు పెంచుతారనే అంచనాలు పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేశాయి. దీంతో ఆసియా, ఐరోపా మార్కెట్లు భారీ పతనాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ సూచీలు ఆరు నెలల కనిష్టానికి తగ్గాయి. ఒక్కరోజే దేశీయ స్టాక్ మార్కెట్లు రూ.4 లక్షల సంపదను కోల్పోయాయి.
ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 900 పాయింట్లుపైగా కోల్పోయిన సెన్సెక్స్ కొద్దిగా కోలుకుంది. సెన్సెక్స్ 856 పాయింట్ల నష్టంతో చివరకు 74454 వద్ద ముగిసింది. నిఫ్టీ 242 పాయింట్లు కోల్పోయి, 22553 వద్ద స్థిరపడింది.
ఐషర్ మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి.ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి పెరగడంతో బాండ్ల రాబడి ఆశాజనకంగా కనిపించింది. దీంతో పెట్టుబడిదారులు దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాలకు తెగబడ్డారు. ఫిబ్రవరిలోనే 24 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు తీసుకున్నారు. కొత్త ఏడాదిలో మొత్తం లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.
డాలరుతో రూపాయి విలువ మరింత క్షీణించింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 86.72 పైసలకు పడిపోయింది.ముడిచమురు ధరలు కూడా ఎగబాకుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ 78 డాలర్లు దాటిపోయింది. బంగారం ధర 2800 డాలర్లకు చేరింది. వెండి కిలో 97 వేలకు చేరింది.