ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 చివరిదశకు చేరుకుంది. అయితే ఇప్పటికీ కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపజేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి చర్యలపై యూపీ పోలీసులు కఠిన చర్య తీసుకున్నారు. తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్న 140 సోషల్ మీడియా ఖాతాల మీద 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసారు. ఆ విషయాన్ని మహాకుంభ్ డిఐజి వైభవ్ కృష్ణ నిర్ధారించారు.
మహాకుంభమేళాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం సోషల్ మీడియా సెల్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రత్యేకించి, త్రివేణీ సంగమంలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలను సర్క్యులేట్ చేసిన వివాదం తర్వాత పోలీస్ సోషల్ మీడియా సెల్ క్రియాశీలకంగా పనిచేస్తోంది.
మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం. దానికున్న మంచిపేరును పాడుచేసే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అబద్ధాలను, తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు. అలాంటి వారి విషయంలో యూపీ ప్రభుత్వం ఎంతమాత్రం అశ్రద్ధ వహించడం లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. గతవారం కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. వాటికి బాధ్యులను గుర్తించి వారిపై యూపీ సర్కారు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది. తాజాగా 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం విశేషం.
ఫిబ్రవరి 13న రెండు తప్పుడు వీడియోలు చెలామణిలోకి వచ్చాయి. మహాకుంభమేళాలో దృశ్యాలుగా ప్రచారం అయ్యాయి. అయితే నిజ నిర్ధారణలో వాటిలో ఒకటి ఈజిప్టు దేశంలో జరిగిన అగ్నిప్రమాదానికి చెందినది. ఇక రెండో వీడియో పట్నా నగరానికి చెందినది కావడం గమనార్హం. మహాకుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు ముగియనుంది. ఫిబ్రవరి 23 రాత్రికే మొత్తం 62కోట్ల మందికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.