పలు దేశాల్లో మానవతా సాయం, అభివృద్ధి పనులకు సాయం అందించే యూఎస్ ఎయిడ్ సంస్థ నుంచి 2 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ జడ్జి అనుమతించిన తరవాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన వారంలో యూఎస్ ఎయిడ్‌లో పనిచేసే పదివేల మందిని తొలగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది సాధ్యం కాకపోవడంతో ఫెడరల్ కోర్టు అనుమతి మేరకు ప్రస్తుతానికి 2 వేల మందిపై వేటు వేశారు.
యూఎస్ ఎయిడ్ సంస్థ తీవ్రవాద సంస్థ అంటూ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోలేమని కోర్టు తేల్చి చెప్పడంతో మిగిలిన ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. తొలగించిన ఉద్యోగులను కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో పోలింగ్ శాతం పెంచేందుకు యూఎస్ ఎయిడ్ 182కోట్లు సాయం చేయడంపై ట్రంప్ మండిపడ్డారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, అలాంటి దేశాలకు ఎందుకు సాయం చేయాలని ఆయన ప్రశ్నించారు. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారో చెప్పాలని, లేదంటే స్వచ్ఛందంగా ఉద్యోగం వదులుకోవాలని మస్క్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగం వదులుకున్న వారికి 8 నెలల జీతం ఇచ్చేందుకు పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 75 వేల మంది ఉద్యోగాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.