వైఎస్ఆర్సిపి నాయకుడు, మాజీ ఎంఎల్ఎ వల్లభనేని వంశీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ మేరకు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ జరపాలని పోలీసులకు సూచించింది. విచారణ వంశీ న్యాయవాది సమక్షంలోనే జరగాలని స్పష్టం చేసింది.
మరోవైపు, వంశీ తన అనారోగ్యం గురించి దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా కోర్టు స్పందించింది. వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ కోర్టుకు పిటిషన్ పెట్టుకున్నారు. దాంతో ఆయనకు బెడ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది.
అంతకుముందు, సిఐడి విభాగం అధికారులు వంశీ మీద పిటి వారంట్ జారీ చేసారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆ వారంట్ జారీ అయింది. ఈ నెల 25న, అంటే రేపు మంగళవారం, ఆయనను హాజరుపరచాలంటూ మూడవ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసులో వంశీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేసింది.
వంశీ ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో ఉన్నారు. ఆ కేసులో రిమాండ్ మంగళవారం ముగియనుంది. ఆయన బైటకు రాగానే సిఐడి కేసు వారంట్ ఎదుర్కోవలసి ఉంటుంది.