దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిత్వ బ్రహ్మ, ఆంధ్రాషెల్లీ అని పేరు గడించిన మహాకవి, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబరు 1న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపాలెంలో తమ్మన్నశాస్త్రి, సీతమ్మ దంపతులకు జన్మించారు. ఆయనపై అనేక ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో భాషాపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్న కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం పట్టారు. నాటి సాహిత్యంలో ప్రధానమైన ధోరణి, ఉద్యమ స్థాయిని అందుకున్న కవితా పద్ధతి భావకవిత్వం. ఆ భావ కవిత్వ యుగంలోని అచ్చమైన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రణయం, ప్రకృతి, దేశభక్తి, ఆధ్యాత్మికత, సంఘ సంస్కరణ, మానవత్వం, కాల్పనికత, మార్మికత ఇవన్నీ నాటి భావకవుల ప్రధానమైన వస్తువులు. ఆ అంశాలన్నీ దేవులపల్లి కవిత్వంలో మనకు దర్శనం ఇస్తాయి.
దేవులపల్లి గీతాలలో దేశభక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రీ. భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లి వారు రాసిన ఈ గేయం జాతీయ పర్వదినాల సందర్భాల్లో తెలుగువారి నోట పలుకుతుంది. అయితే దేశభక్తి ఛాయలోనే ఆంధ్రదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ ఆయన రచించిన మరొక గేయం ‘‘జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ’’. ఆ గీతం చాలామందికి పరిచమయమే ఉండదు. ఆ పాటలో ఆంధ్రదేశాన్ని భారతధాత్రి ప్రియపుత్రీ అంటూ ఆ భరతమాత పుత్రికగా దేవులపల్లివారు ఊహించారు. ఈ పాట ముగింపులో జగమంతా తన కుటుంబమే అని నమ్మే విశాల హృదయాన్ని కవి కనబరిచారు. విశాల మానవతా సమతా వాదమే మన మనోరథం కావాలని, ఏ కుల మత వైషమ్యాలూ లేని సమానత్వంతో మానవత్వాన్ని సాధించి మనుషులంతా ఒకే కుటుంబంగా జీవించే ఆశయాన్ని సాధించాలని అందుకోసం నడుం కట్టాలని దేవులపల్లిగారు ప్రబోధించారు. లోక కళ్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛ కోసం దృఢమైన శపథం తీసుకోవాలని బోధించారు. ఆ ఆశయసాధన కోసం క్షణకాలమైనా వృథా చేయకుండా అంకితం అవుతామని, గమ్యం కోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరబోవనీ దేవులపల్లి వారు ఆ గేయంలో స్పష్టం చేసారు. అటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలిగేలా దీవించమనీ కోరారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు కేవలం తన రాతల ద్వారానే కాదు, చేతల ద్వారా కూడా దేశం పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. బ్రహ్మసమాజంలోనూ, నవ్య సాహితీసమితిలోనూ సభ్యునిగా భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. సమాజం పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. అందుకే, హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంధువులు ఆయన్ను వెలివేసినా వెనుకాడకుండా వేశ్యా వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు. దేవుడు గుడిలో ఎక్కడో కొలువు ఉండడు, జనం మధ్యలో తిరుగుతుంటాడు, ముఖ్యంగా దీనజనుల మధ్య ఉంటాడని తెలుపుతూ “ఈ సుధర్మ భవనములో ఈరేడు జగాలనేలు ఈశ్వరుడే దినజన హృదీశ్వరుడే కొలువుదీర్చు..” అని తన గీతం ద్వారా సమాజాన్ని మేల్కొలిపారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ, 1978లో సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో పద్మభూషణ్ దేవులపల్లిని వరించాయి. 1964లో గొంతు క్యాన్సర్ బారిన పడడంతో ఆయన స్వరపేటికను తొలగించారు. మూగబోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. ఆయన 1980 ఫిబ్రవరి 24న కన్నుమూశారు. వారు భౌతికంగా లేకపోయినా, వారి గేయ రచనా కౌశలం మనందరి చెవుల్లో, గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆ మేటి సాహితీ దురంధరుడి ఆకాంక్ష అయిన “వసుధైవ కుటుంబం” సాధన దిశగా అడుగులు వేయడమే ఆ మహాకవికి మనమిచ్చే నివాళి.