ప్రతిపక్ష హోదా ఇవ్వండి,ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కేవలం 2 నిమిషాల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభలో తమ పార్టీ అధినేతకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ ఆవరణలో నినాదాలు చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
వైసీపీ అధినేత జనగ్‌మోహన్‌రెడ్డి ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యారు. సభలో ప్రవేశించిన రెండు నిమిషాలకే లేచి నిలబడి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ప్రజాస్వామన్ని రక్షించాలంటూ గగ్గోలు పెట్టారు. మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్సతో కలసి జనగ్‌మోహన్‌రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాకౌట్ తరవాత గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. ఎనిమిది నెలల కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధిపై గంటకుపైగా ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గుంతలు లేని రోడ్లు విషయంలో మంచి పురోగతి సాధించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.
దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తిలో సగం ఏపీ నుంచే వస్తున్నాయని గవర్నర్ తెలిపారు. ఆక్వారంగంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. వ్యవసాయరంగంలో 22 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలోనే గత ప్రభుత్వ తప్పులను సరిదిద్ది పాలనను గాడిలో పెట్టినట్లు గవర్నర్ చెప్పారు.