ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర జరుగుతున్న మహాకుంభమేళా మీద విమర్శలు చేస్తున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్నవారు హిందూ విశ్వాసాలపై నిరంతరాయంగా దాడులు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మధ్యప్రదేశ్ ఛతర్‌పూర్‌లో బాగేశ్వర్‌ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక సమరసతకు, ఐక్యతకు భంగం కలిగించడమే హిందూ వ్యతిరేకుల లక్ష్యమంటూ మండిపడ్డారు. ‘‘మన సమాజాన్ని విభజించడం, ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారి ఎజెండా’’ అని ప్రధాని అన్నారు.
వారికి మద్దతిస్తూ మన దేశాన్ని, మతాన్ని బలహీనపరచాలని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. మతాన్ని, ప్రజలను అపహాస్యం చేసే పనిలో కొందరు పూర్తిగా మునిగిపోయారని, విదేశీ శక్తులు సైతం వారికి అనేక సార్లు సాయపడ్డాయన్నారు. ఆ విధంగా దేశాన్ని, హిందూ మతాన్నీ బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. హిందూ విశ్వాసాలను ద్వేషించే వ్యక్తులు కొన్ని వందల యేళ్ళుగా ఏదో ఒక రూపంలో వుంటూనే వున్నారని అన్నారు.
బానిస మనస్తత్వంలో కూరుకుపోయిన వ్యక్తులు హిందూ విశ్వాసాలు, దేవాలయాలను, సంస్కృతిపై దాడి చేస్తున్నారంటూ మోదీ విరుచుకుపడ్డారు. మహాకుంభమేళా నిర్వహణ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోందన్నారు. మహాకుంభమేళాను విజయవంతం చేయడంలో పారిశుద్ధ కార్మికులు, పోలీసుల కృషి ఎనలేనిదన్నారు. వేల మంది వైద్యులు, స్వచ్ఛంద సేవకులు అంకిత భావంతో, సేవాస్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు.
దేశ సమైక్యత గురించి ధీరేంద్ర శాస్త్రి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని ఆ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. మానవాళి ప్రయోజనం కోసం ఆయన కేన్సర్ ఇనిస్టిట్యూట్ కూడా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. బాగేశ్వర్‌ధామ్‌లో ఇకపై ఆధ్యాత్మికత, ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు.