అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కొనసాగిస్తోంది. తాజాగా 12 మంది అక్రమ వలసదారులతో కూడిన విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఫిబ్రవరి 5న మొదటి విడత వలసదారులను తరలించిన అమెరికా, తాజాగా నాలుగోసారి తరలించింది. మరో 300 మంది భారత అక్రమ వలసదారులు పనామా హోటళ్లో బస చేశారని వారిని తరలించనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అక్రమ వలసదారులను తరలించడం సాధారణ విషయమేనని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అక్రమ వలసలను భారత్ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని ఆయన గుర్తుచేశారు. వివిధ దేశాల్లో అక్రమంగా ఉంటోన్న భారతీయులు తిరిగి రావాలని ఆయన సూచించారు.
అమెరికా జనాభాలో మొత్తం 3.3 శాతం మంది అంటే దాదాపు 2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. వీరిలో భారతీయులు 7 లక్షల దాకా ఉంటారని తెలుస్తోంది. అధికారికంగా 18 వేల మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా తరలివెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. 2019 నుంచి ఇప్పటి వరకు మెక్సికో సరిహద్దు ద్వారా 9 లక్షల మంది బాలలు కూడా అమెరికాలో ప్రవేశించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. వారిని సురక్షితంగా వారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.