త్రివేణి సంగమం మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 62 కోట్లకు చేరిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని పాటించే వారు 120 కోట్ల మంది ఉండగా వారిలో సగానిపైగా ప్రజలు త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేశారని ఆయన గుర్తుచేశారు.
మహాకుంభ్నగర్లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతి, వందలాది సాధువుల సమక్షంలో మహా కుంభమేళా మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి సహా పలువురు సాధువులు పాల్గొన్నారు. తమ విశ్వాసాన్ని తెలిపేందుకు కోట్లాది మంది భారీగా ఒక చోట చేరిన కార్యక్రమం ప్రపంచంలో మరొకటి లేదని యోగీ గుర్తుచేశారు.
మహాకుంభమేళా ఈ శతాబ్దపు అత్యంత అరుదైన ఘటనగా ఆయన అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని రక్షించడంలో విజయేంద్ర సరస్వతి ముందు వరుసలో ఉంటారని సీఎం యోగీ కొనియాడారు. మహా కుంభమేళా మరో రెండు రోజులే ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శివరాత్రితో కుంభమేళా ముగియనుంది.