శాసనసభ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. అయితే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ సభ్యులు సభలో డిమాండ్ చేయనున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష హోదా అవసరమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవాళ్లందరూ ప్రొటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచే సభలోకి రావాల్సి ఉంటుంది.
గేట్ నెంబర్ 1 నుంచి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తదితరులకు అనుమతి ఉంటుంది. గేట్ నెంబర్ 2 నుంచి మంత్రులను అనుమతిస్తారు. ఇక గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ లోపలకు రావాల్సి ఉంటుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యే మాత్రమే కావడంతో గేట్ నెంబర్ 4 నుంచి నడుచుకుంటూ రావాల్సి ఉంది. స్పీకర్ తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి గేట్ నెంబర్ 1 నుంచి వచ్చేందుకు జగన్ కు అనుమతిని ఇస్తారా? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.