ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, సింగరేణి నిపుణులు రంగంలోకి దిగారు. ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆర్మీ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ నుంచి సొరంగం పనుల్లో నిపుణులైన ఇంజనీర్లను పంపించారు.
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులు నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపంట వద్ద జరుగుతున్నాయి. సొరంగంలో 14వ కి.మీ వద్ద పనులను 4 రోజుల కిందటే ప్రారంభించారు. నాలుగేళ్ల కిందట ఆగిపోయిన పనులు నాలుగు రోజుల కిందట మొదలయ్యాయి. జేపీ వెంచర్స్ ఈ పనులను చేపడుతోంది. శనివారం నాడు 40 మంది కార్మికులు, ఇంజనీర్లు ఉదయం 8 గంటలకు పని ప్రదేశానికి చేరుకున్నారు. కాసేపటికే సొరంగం కప్పు విరిగి మీద పడింది. కొందరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు బోరింగ్ మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు గల్లంతయ్యారు. 32 మంది సురక్షితంగా వెలుపలికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం సహాయచర్యలు చేపట్టారు. 13 కి.మీ నుంచి పెద్ద ఎత్తున నీరు ఉబికి రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సొరంగం పై కప్పు నుంచి బురద జారి పడటంతో తొలగించే పనులు చేపడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. కార్మికులను సురక్షితంగా వెలికి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.