తమిళ స్టార్ అజిత్‌కు పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌లో జరుగుతోన్న కార్ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన నడుపుతోన్న కారు ఆరు ఫల్టీలు కొట్టింది. కాసేపటి తరవాత సురక్షితంగా బయటకు వచ్చారు. కారు అతి వేగంగా నడిపే సమయంలో మరో కారు అడ్డుగా రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి అజిత్ తప్పులేదని ఆయన రేసింగ్ టీం ప్రకటించింది. ప్రమాదం తరవాత ఆయన అభిమానులతో ఫోటోలు దిగారు.
ఇటీవల దుబాయ్ కేంద్రంగా జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్ సన్నాహాల్లోనూ అజిత్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తోండగా కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జయింది. అజిత్ క్షేమంగా బయటపడ్డారు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవల అజిత్ ఓ కారును గంటకు 234 కి.మీ వేగంగా నడుపుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
కోలీవుడ్ స్టార్ అజిత్‌కు #ajith మొదటి నుంచి రేసింగ్ అంటే పిచ్చి. షూటింగ్ అయిపోతే చాలు కార్లు, బైకులతో రేసులు ప్రాక్టీస్ చేస్తారు. ఆయనకు రేసింగ్ టీం కూడా ఉంది. ఉత్సాహవంతులకు శిక్షణ ఇచ్చేందుకు రేసింగ్ అకాడమీ కూడా అజిత్ నడుపుతున్నారు. ఆయన తాజాగా నటిస్తోన్న బ్యాడ్ అండ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.