పవిత్ర స్నానాల మహాఘట్టం మహాకుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో 54 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ నెల 26 శివరాత్రి నాటికి 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసిన వారి జాబితాలో చేరతారని అంచనా. మరో మూడు రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. త్రివేణి సంగమం వెళ్లే అన్ని రహదారులు జన సముద్రంలా మారాయి.
దేశంలో 143 కోట్ల జనాభా ఉండగా అందులో సనాతన ధర్మం ఆచరిస్తున్న వారు 110 కోట్లు ఉన్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్య 120 కోట్లు పైమాటే. అంటే సనాతన ధర్మం ఆచరిస్తున్న వారిలో సగం మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు పాపులేషన్ ప్యూచర్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఇంత భారీగా సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలకు జనం హాజరు కాలేదని ప్రకటించింది.
మహాకుంభమేళాకు మొత్తం 60 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా రూ.7500 కోట్ల ఖర్చుతో ప్రయాగ్రాజ్, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసింది. మహాకుంభమేళాతో యూపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలోకి రూ.3 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వేలాది మందికి ఉపాధి లభించడంతోపాటు అనేక ప్రాంతాల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి.