కేంద్ర సాయంతో మిర్చి రైతును ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మిర్చికి కేంద్రం క్వింటాకు రూ.11781 కనీస ధర ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీనికి మరికొంత జోడించి రైతులకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో మిర్చి ధరలు దారుణంగా పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా మిర్చి రూ.9 వేల నుంచి గరిష్ఠంగా రూ.13 వేల వరకు పలుకుతోంది. అయితే సాధారణ రకాలు రూ.9 వేలు దాడటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శుక్రవారంనాడు కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని మిర్చి రైతును ఆదుకునేందుకు సిద్దం అయ్యారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద నిబంధనలు సడలించి మొత్తం పంటలో 75 శాతం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్దమైంది.
మిర్చి రైతును #mirchisupportprice ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు వ్యాపారులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించారు. ధరలు తగ్గకుండా చూడాలని ఆదేశించారు. ఎగుమతులకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది.