ప్రధాని మోదీ రెండో ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాస్‌ను నియమించారు. శక్తికాంత దాస్‌ను నియమిస్తూ క్యాబినెట్ వ్యవహారాల నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది. 1980 తమిళనాడు ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శక్తికాంత దాస్ అనేక కీలక పదవులు చేశారు. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా సేవలందించారు. జీ 20 సమావేశాలకు షెర్పాగా వ్యవహరించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా సేవలందించారు. 2018 నుంచి 2024 డిసెంబరు 10 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
ఇప్పటికే ప్రధాని మోదీ ముఖ్యకార్యదర్శిగా పి.కె.మిశ్రా పనిచేస్తున్నారు. ఆయనకు సమాన హోదాలో శక్తికాంతదాస్ నియామకం జరిగింది. అయితే దాస్ ఎంతకాలం పదవిలో కొనసాగుతారు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రధాని మోదీ పదవిలో ఉన్నంత కాలం దాస్ పదవిలో కొనసాగే అవకాశముంది. లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగుతారు. ప్రధాని మోదీ ఇద్దరు ముఖ్య కార్యదర్శులూ ఒడిషాకు చెందిన వారు కావడం గమనార్హం.
ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, ప్రధాని పర్యటనలు ముఖ్య కార్యదర్శల పర్యవేక్షణలో జరగనున్నాయి. ప్రధాని కార్యాలయం నిర్వహణ విషయంలో ముఖ్యకార్యదర్శులే కీలకం.