ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా ఫిబ్రవరి 23 ఆదివారం నాడు దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా కోచ్ గంబీర్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్ళు చెమటోడ్చారు. అన్ని విభాగాల్లో ప్రాక్టీస్ చేస్తోన్న ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాల్లో క్రికెట్ అభిమానులతో పంచుకుంది.
అయితే కోహ్లీ గాయమైనట్లుగా కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ రేపటి మ్యాచ్ లో ఆడలేకపోవచ్చు అని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
న్యూజీలాండ్ తో ఆడిన తొలి మ్యాచ్ లో ఓడిన పాకిస్తాన్,భారత్ పై గెలిస్తేనే సెమీస్ పై ఆశలుంటాయి. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచిన భారత్, పాకిస్తాన్ పై నెగ్గితే సెమీస్ కు అర్హత సాధించినట్లే.
భారత్ తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ ప్రత్యేకంగా సమాయత్తమైంది. స్పెషల్ కోచ్ సారధ్యంలో శిక్షణ తీసుకుంది. దుబాయ్ మైదానంపై మంచి అవగాహన ఉన్న వెటరన్ ముదాసర్ నాజర్ ను పీసీబీ , స్పెషల్ కోచ్ గా నియమించింది. ఆ జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకీబ్ జావేద్ తో కలిసి జట్టుకు శిక్షణ ఇచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ లో ఇరు జట్టు ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా మూడు సార్లు భారత్, రెండుసార్లు పాకిస్తాన్ నెగ్గాయి. వన్డే క్రికెట్ లోనూ పాకిస్తాన్ పై భారత్ దే పైచేయిగా ఉంది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్) అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, మహమద్ షమీ, వరుణ్ చక్రవర్తి.