మహారాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో అక్రమ ఆక్రమణల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. పుణే జిల్లా పింప్రి చించ్‌వాడ్‌లోని కుడల్‌వాడి-చిఖ్లీ ప్రాంతంలో ఏకంగా 827 ఎకరాల భూమిలోని ఆక్రమణలను కూలగొట్టేసింది. ఆ ప్రాంతంలో మొత్తం 4,111 అక్రమ నిర్మాణాలను తొలగించాలన్న లక్ష్యాన్ని సాధించింది. ఆ క్రమంలో అక్కడ దశాబ్దాల తరబడి పాతుకుపోయిన సెటిల్మెంట్లు, తుక్కు దుకాణాలు, చట్టవిరుద్ధమైన వేర్‌హౌస్‌లు, అనధికారిక మసీదులు ఎన్నో బైటపడ్డాయి.
మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పింప్రి-చించ్‌వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నో యేళ్ళుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటూ నోటీసులు, హెచ్చరికలూ జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ రాజకీయ జోక్యాల కారణంగా ఇన్నేళ్ళలోనూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ ప్రాంతం చట్టమనేదే లేని ప్రాంతంగా మారిపోయింది. అక్రమ దందాలు, వ్యాపారాలకు నెలవుగా నిలిచింది. భద్రతకు ముప్పుగా పరిణమించింది.
2024 డిసెంబర్ 8న అక్కడ ఒక అక్రమ తుక్కు దుకాణంలో మంటలు రేగి అగ్నిప్రమాదానికి దారితీసాయి. ఫలితంగా ఏ తనిఖీలూ లేని ఆక్రమణల వల్ల ఎదురయ్యే ముప్పు అనుభవంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో ప్రతీ యేటా కనీసం 10 అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని రికార్డులు తెలియజేస్తున్నాయి. అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళలో అత్యధికులు అక్రమంగా దేశంలోకి చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలే. అలా జాతీయ భద్రతకు కూడా ముప్పుగా నిలిచిందా ప్రాంతం.
స్థానిక వార్తానివేదికల ప్రకారం ఆ ప్రాంతం నేరాలకు కేంద్రస్థానంగా ఎదిగింది. భూ ఆక్రమణలు, ట్రాఫిక్ రద్దీ, మత ఉద్రిక్తతలు రోజువారీ నిత్యకృత్యాలుగా మారిపోయాయి. ల్యాండ్ జిహాద్ లాంటి నేరాలకు ఆ అక్రమ సెటిల్మెంట్లు చిరునామాలుగా మారిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఏవైనా సరే కబ్జా అయిపోవలసిందే. ఇంక హిందూ అమ్మాయిలను మోసపూరితంగా ఆకట్టుకుని మతాంతర ప్రేమ పేరిట ముగ్గులోకి దింపి చివరికి లవ్‌జిహాద్‌కు పాల్పడే నేరాలు కూడా కొదవ లేదు. ఆ ప్రాంతంలో హిందువుల ఊరేగింపు జరిగిందంటే చాలు, దాని మీద రాళ్ళు పడాల్సిందే. ఉగ్రవాద సంస్థల్లో పనిచేసే వారికి అక్కడ ఆశ్రయం దొరుకుతుంది. ఉదాహరణకి ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన యాసిన్ భత్కల్ తలదాచుకున్నది అక్కడే. అలా ఆ ప్రాంతం జాతీయ భద్రతకు, స్థానిక ప్రజల రక్షణకూ కూడా ముప్పుగా మారిపోయింది.
అక్రమ ఆక్రమణల తొలగింపు ఆపరేషన్‌ను కొంతమంది రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అబూ ఆసిమ్ అజ్మీ, అస్లాం షేక్ వంటి నాయకులు అక్కడి బంగ్లాదేశీ, రోహింగ్యా సెటిలర్లకు అండగా నిలిచారు. అక్కడ సెటిలర్లకు పాకిస్తాన్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తారనే అనుమానాలూ ఉన్నాయి. ఆ విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని పలువురు స్థానికులు పలుమార్లు డిమాండ్ చేసారు.
స్థానిక ఎంఎల్ఏ మహేష్ లాండ్గే ఆ ప్రాంతంలో దిగజారిపోతున్న శాంతి భద్రతల పరిస్థితి గురించి కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో జోక్యం చేసుకోకపోతే ఆ ప్రాంతం మరికొన్నాళ్ళలోనే నేరాలకు కేంద్రస్థానంగా మారిపోతుందని, మహిళలూ పిల్లలకు రక్షణ కరవవుతుందనీ వాపోయారు.
ఆ నేపథ్యంలో అక్రమ ఆక్రమణలను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూల్చివేత కార్యక్రమానికి మునిసిపల్ కమిషనర్ శేఖర్ సింగ్, పోలీస్ కమిషనర్ వినయ్‌కుమార్ చౌబే నాయకత్వం వహించారు. అదనపు మునిసిపల్ కమిషనర్ ప్రదీప్ జంభాలే పాటిల్, డిప్యూటీ కమిషనర్ మనోజ్ లొంకార్ కూల్చివేత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదనపు పోలీస్ కమిషనర్ వసంత్ పర్దేశీ, డీసీపీలు స్వప్నా గోరే, శివాజీ పవార్, సందీప్ దోయిఫోడే, వివేక్ పాటిల్ భద్రతా ఏర్పాట్లు చేసారు.
ఆ కూల్చివేత ఆపరేషన్‌కు 600మంది పోలీస్ అధికారులు, 180 మంది మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు భద్రత కల్పించారు. పెద్దసంఖ్యలో కూలీలు పాల్గొన్నారు. 16 ఎక్స్‌కవేటర్లు, 8 జేసీబీలు, 1 క్రేన్, 4 కట్టర్లు ఉపయోగించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఫైరింజన్లు, ఆంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచారు. అక్రమ సెటిల్మెంట్లను తొలగించే పని పూర్తయినా, ఇంకా 27 అక్రమ మసీదుల కూల్చివేత ఇంకా పెండింగ్‌లో ఉంది. అన్నిరకాల రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొని సుమారు 900 ఎకరాల ఆక్రమణలను కూల్చివేసిన ఘనత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు దక్కింది.
ఆ అక్రమ సెటిల్మెంట్లు ఏర్పడడానికి ఆర్థికంగా, రాజకీయంగా ఎవరు అండగా నిలిచారో తెలుసుకోడానికి అధికారిక దర్యాప్తు చేపట్టాలని అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోంశాఖను రాష్ట్రప్రభుత్వం కోరింది.
30ఏళ్ళుగా కబ్జాకు గురైన కుడల్‌వాడి-చిఖ్లీ ప్రాంతంలో ఈ భారీ అక్రమ ఆక్రమణల కూల్చివేత ఆపరేషన్ సాహసోపేతమైన చర్య అనే చెప్పవచ్చు. ఆపరేషన్ దాదాపు విజయవంతమైంది, కానీ ఆ ప్రాంతాల్లో మళ్ళీ కబ్జాలు జరగకుండా చూసుకోవడం పెద్ద సవాలే.