తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి ప్రేరణ పొందారని, పొందుతూనే వున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
“మహారాష్ట్ర అనే గొప్ప ప్రదేశంలో, మరాఠీ మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి వందేళ్ళ క్రితం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విత్తనాలను నాటారని మేము గర్విస్తున్నాము. నేడు మనం దాని శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఆ సంస్థ మర్రి చెట్టులా పెరిగి అభివృద్ధి చెందింది” అని ప్రధాని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ తనలాంటి లక్షలాది మందిని దేశం కోసం జీవించడానికి ప్రేరేపించిందని, సంఘ్ కారణంగానే మరాఠీ భాష, మరాఠీ సంప్రదాయాలతో అనుసంధానమయ్యే అవకాశం తనకు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఘనమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కొత్త తరాలకు అందించడానికి ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ద కాలంగా సంస్కార యాగాన్ని నిర్వహిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో భాషల మధ్య ఎలాంటి శత్రుత్వమూ లేదనీ, ప్రతీ భాషా ఒకదానినొకటి సుసంపన్నం చేసాయనీ, తద్వారా భాష ప్రాతిపదికపై వివక్ష చూపే ప్రయత్నాలకు అవి గుణపాఠం నేర్పాయనీ మోదీ అన్నారు. మరాఠీని పరిపూర్ణమైన భాషగా అభివర్ణించారు. ధైర్య సాహసాలు, రమ్యత, సున్నితత్వం, సమానత్వ లక్షణాలు కలగలిసిన భాష మరాఠీ అని కొనియాడారు.
‘‘భారతీయ భాషల మధ్య ఎప్పుడూ ఎలాంటి విరోధమూ లేదు. భాషలు ఎప్పుడూ మంచి ప్రభావమే చూపించాయి, పరస్పరం సుసంపన్నం చేసుకున్నాయి’’ అని ప్రధాని అన్నారు. భాషల ఆధారంగా దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరిగినప్పుడు దేశంలో భాషాపరమైన వారసత్వ సంపద దీటుగా జవాబిచ్చిందని ప్రధాని వివరించారు. ‘‘ఈ దురవగాహనలకు దూరంగా ఉండి, అన్ని భాషలనూ స్వాగతించి సుసంపన్నం చేసుకోవడం మన సామాజిక బాధ్యత’’ అని ప్రధాని స్పష్టం చేశారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలు ద్వారా దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రోజునే ప్రధాని మోదీ ఆ విధంగా మాట్లాడడం విశేషం.
భారత్ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన, నేటికీ సజీవంగా ఉన్న నాగరికతల్లో ఒకటి, దేశం నిరంతరం పరివర్తన చెందుతూ కొత్త అభిప్రాయాలను, మార్పులను స్వాగతించడమే దానికి కారణం అని మోదీ విశ్లేషించారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద భాషా వైవిధ్యం భారతదేశంలో ఉండడమే దానికి నిదర్శనం. ఈ భాషా వైవిధ్యమే భారతదేశపు సమైక్యతకు మౌలికమైన ప్రాతిపదిక’’ అని ప్రధాని అన్నారు.
మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని న్యూఢిల్లీలో 71 ఏళ్ల తరువాత, మరాఠీకి ప్రాచీన సాంస్కృతిక భాష హోదా మంజూరు చేసిన ఒక ఏడాది తరువాత నిర్వహిస్తున్నారు. ఆ ప్రారంభ కార్యక్రమానికి ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, 98వ అఖిల భారతీయ మరాఠీ సమ్మేళన్ అధ్యక్షుడు, సాహితీవేత్త తారా భావల్కర్ తదితరులు హాజరయ్యారు.