గెజిట్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం
చిన్న తరహా ఖనిజాల జాబితాలోని బెరైటీస్, క్వార్ట్జ్, ఫెలస్పర్, మైకాలను ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేరుస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఖనిజాలు ఈనెల 20 నుంచి మేజర్ మినరల్స్ పరిధిలోకి వచ్చాయి. గతంలో ఇవి ప్రధాన ఖనిజాల జాబితాలోనే ఉండగా 2015లో మైనర్ మినరల్స్ జాబితాలోకి చేర్చారు.
కేంద్రం విడుదల చేసిన గెజిట్ మేరకు ఇక నుంచి లీజులను 50 ఏళ్ళ వ్యవధికి మంజూరు చేస్తారు. ఇప్పటికే మంజూరైన లీజులకు కూడా ఇదే వర్తించనుంది. నాలుగు ఖనిజాల గనుల లీజు కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనుమతి పొందాలి. ఇందుకోసం జూన్ 30లోపు మైనింగ్ ప్లాన్లు ఐబీఎంకు అందజేయాలని ఉత్తర్వులో కేంద్రం స్పష్టం చేసింది.
ఇక నుంచి ఈ నాలుగు ఖనిజాల లీజులను కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.లేటరైట్ట్, డోలమైట్‌లను చిన్న తరహా ఖనిజాల జాబితాలోనే ఉంచారు.
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో బెరైటీస్ మైనింగ్ ఉండగా పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పరిధిలో సిలికా, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో మైకా ఖనిజ లీజులు ఎక్కువగా ఉన్నాయి.